ఆ షేర్ల పతనం చూడతరమా?

రోజూ పత్రికలు, ఛానల్స్ మన మార్కెట్లు చాలా పటిష్ఠంగా ఉన్నాయని ఊదరగొడుతున్నాయి. ట్రంప్ మన మార్కెట్ ముందు ఎంత అనే ప్రశ్నలు వేస్తున్నాయి. అమెరికా మార్కెట్‌తో సంబంధం లేకుండా మనం ముందుకు సాగుతామని అంటున్నాయి. దాదాపు అదే ట్రెండ్‌ను సూచీలు చూపిస్తున్నాయి. నిఫ్టి, సెన్సెక్స్ కన్సాలిడేషన్‌లో ఉన్నాయని చెబుతున్నాయి. కాని తమ పోర్టుఫోలియోలను చూసుకున్న ప్రతిసారీ మధ్య, చిన్న ఇన్వెస్టర్లు ఘొల్లు మంటున్నారు. ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లను నమ్ముకున్నవారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత మూడేళ్ళలో నిఫ్టి నుంచి పెద్దగా వచ్చిన రిటర్న్స్‌లు లేవు. కన్సాలిడేషన్‌తో నెట్టుకొస్తున్నా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అనేక షేర్లు 30 నుంచి 40 శాతం పడిపోయాయి. అయినా వాటికి మద్దతు కన్పించడం లేదు. ఇపుడు ఐటీ షేర్ల వంతు వచ్చింది. ఫలితాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ పతనం జోరందుకుంది. ఇవాళ కూడా దాదాపు రెండు శాతం క్షీణించింది. పలు మిడ్ క్యాప్ ఐటీ కంపెనీల పతనం ఇన్వెస్టర్లను నివ్వెరపరుస్తోంది. మరోవైపు ఫార్మా షేర్లలో కూడా ఇపుడు ఒత్తిడి వస్తోంది. ట్రంప్ భారీ సుంకాలు వేస్తానని బెదిరించడంతో అనేక మంది ఇన్వెస్టర్లు ఈ కౌంటర్ల నుంచి వైదొలగుతున్నారు. భారత్-ట్రంప్ మధ్య ఈ మధ్యకాలంలో ఒప్పందం కుదిరే ఛాన్స్ లేదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా అమ్ముకుంటున్నాయి. ఇక ఎఫ్‌ఐఐల అమ్మకాలకు అంతే లేదు. క్రమంగా ఇపుడు నిఫ్టి కూడా తన మద్దతు స్థాయిలను కోల్పోతూ వస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్‌తో సరిపెట్టుకుంటున్నారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోమాత్రం కరిగిపోతోంది. మరి ట్రెండ్‌కు ఇప్పట్లో తెర పడే అవకాశం కన్పించడం లేదు. ఫలితాల సీజన్ అయిపోయింది. ఇక మార్కెట్‌ను లేపే అంశాలు ఏవీ లేవు. మరి షేర్లలోనూ కన్సాలిడేషన్ ఉంటుందా లేదా పతనం మరింత ముదురుతుందా అన్న టెన్షన్ మార్కెట్‌లో ఉంది.