For Money

Business News

తులం బంగారం రూ.1,00,016

బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ మారాథాన్‌ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ విలువ భారీగా క్షీణించడంతో బులియన్‌ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అమెరికాలో మాంద్యం రావడం ఖాయమన్న వార్తతో వెండికి పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్‌ తగ్గింది. దీంతో వెండి స్పీడ్‌ తగ్గగా, బంగారం డబుల్‌ స్పీడుతో పెరుగుతోంది. అమెరికా మార్కెట్లలో ఇవాళ ఔన్స్‌ బంగారం 3 శాతం పెరిగి 3,442 డాలర్లకు చేరింది. దీనికి ప్రధాన కారణం డాలర్‌ ఇండెక్స్‌ విలువ 98కి దిగువకు రావడం. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 97.682ను తాకింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలకు పట్ట పగ్గాల్లేకుండా పోయింది.ఇక మన దేశంలో తులం అంటే పదిగ్రాముల బంగారం ధర రూ. 1లక్షను దాటినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఇవాళ ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర (24 క్యారెట్లు) రూ.1,00,016కు చేరినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇవాళ ఒక్క రోజే బంగారం ధర సుమారు రూ.2000 దాకా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు రూ.20 వేలకు పైనే పెరిగింది. గత డిసెంబర్‌ 31న సుమారు రూ.79 వేలు ఉన్న పసిడి ధర వంద రోజుల్లో 26 శాతం పెరిగింది. ఇక ఎంసీఎక్స్‌లో స్టాండర్డ్‌ బంగారం 10 గ్రాముల ధర (జూన్‌ కాంట్రాక్ట్‌) 97365ని తాకింది. ఇపుడు రూ. 97009 వదకద ట్రేడవుతోంది.