మినీ తుపాను వచ్చి వెళ్ళింది…

స్టాక్ మార్కెట్లో రోలర్ కోస్టర్ గేమ్ జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయలు పోవడం.. రావడం కొన్ని గంటల్లో పూర్తవుతోంది. మరికొన్ని గంటల్లో భారత ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతున్న నేపథ్యంలో మార్కెట్లో వదంతులు స్వైర విహారం చేస్తున్నాయి. సుంకాలు పడుతాయని కొందరు, వేయరని కొందరు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం భారీ నష్టాలతో 23000 స్థాయి దిగువకు వెళ్ళిన నిఫ్టి… మిడ్‌సెషన్‌లో లాభాల్లోకి వచ్చింది. మళ్ళీ ఒక మోస్తరు నష్టాల్లోకి జారుకుంది. అక్కడి నుంచి క్లోజింగ్‌లో స్వల్ప నష్టాలతో ముగిసింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 22,798 పాయింట్లు కాగా, అక్కడి నుంచి 23144 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అంటే సుమారు 350 పాయింట్లు కోలుకుందన్నమాట. చివర్లో 26 పాయింట్ల నష్టంతో 23045 వద్ద ముగిసింది. అయితే ఇవాళ యాక్షన్ మొత్తం మిడ్ క్యాప్స్‌లో ఉంది. ఒకదశలో రెండు శాతంపైగా నష్టపోయిన మిడ్ క్యాప్స్ షేర్ల సూచీ గ్రీన్‌లో ముగిసింది. బ్యాంక్ నిఫ్టి కోలుకుంది. ఇవాళ భారీగా దెబ్బతిన్నది మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీల సూచీ. ఈ రంగానికి చెందిన అనేక కంపెనీలు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి టాప్గెయినర్ బజాజ్ ఫిన్ సర్వ్ కగా, నిఫ్టి టాప్ లూజర్ ఎం అండ్ ఎం.