కాకినాడ సీ పోర్ట్ దెబ్బ!

కాకినాడు సీ పోర్టు, సెజ్ వ్యవహారాలు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బలి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి ఈనెల రేపు రాజీనామా చేస్తున్నట్టు విజయసాయి రెడ్డి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఇటీవల కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో విజయసాయి రెడ్డిని ఈడీ విచారించింది. కాకినాడ సీ పోర్టుతో పాటు అనేక అక్రమ, అవినీతి కేసుల్లో విజయసాయి రెడ్డి ప్రమేయం గురించి టీడీపీ నేతలు పదే పదే ప్రస్తావన చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం నగర శివార్లల్లో వందల ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వైకాపా ఘోర ఓటమి తరవాత కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాలను వెలికి తీస్తోంది. ముఖ్యంగా కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు అడ్డంగా దొరికనట్లు తెలుస్తోంది. అది కార్పొరేట్ క్రైమ్ కావడంతో ఆర్ఓసీ పక్కా ఆధారాలు దొరికినట్లు టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో విజయసాయి రెడ్డి రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ జరిపిన విచారణలోని కీలక అంశాలు కేంద్రానికి చేరినట్లు తెలుస్తోంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాజ్యసభలో కీలక పదువుల్లో కొనసాగడం భావ్యం కాదని కేంద్రం కూడా భావించినట్లు తెలుస్తోంది. దీంతో తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని కేంద్రం, కూటమి నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. తాజా కేసుల నుంచి బయటపడేందుకు ఆయన రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ నేతల మధ్యవర్తిత్వంతో విజయసాయికి, కూటమి నేతలకు మధ్య రాజీ కుదరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి అంగీకరించిన విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటన ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం విశేషం.