అన్నీ పతనంవైపే…
ఇవాళ్టి బ్యాంక్ నిఫ్లి వీక్లీ క్లోజింగ్ ఓ పీడకలగా మారింది ఇన్వెస్టర్లకు. దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి కూడా 200 DMAలను తాకాయి. 1.40 వరకు ఒక మోస్తరు నష్టాలతో ఉన్న నిఫ్టిలో అమ్మకాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. నిఫ్టి 23,509ని తాకింది. తరవాత కొద్దిగా కోలుకున్నట్లు కన్పించినా.. క్రితం ముగింపుతో పోలిస్తే ఏకంగా 324 పాయింట్ల నష్టంతో నిఫ్టి ముగిసింది. నిఫ్టిలో 44 షేర్లు నష్టాల్లో ముగిశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిఫ్టి ఒకదశలో గ్రీన్‌లో ప్రారంభమైంది. కాని చివర్లో భారీ అమ్మకాల కారణంగా 50000లకు దిగువకు చేరి 49904ని తాకింది. 200 రోజుల చలన సగటును తాకింది. కాని చివరల్లో కోలుకుని 50,088 వద్ద ముగిసింది. మార్కెట్‌కు ఏ రంగం నుంచి కూడా మద్దతు అందలేదు. చక్కటి లాభాలు అందించిన కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ వచ్చింది. ఇవాళ నిఫ్టి షేర్లలో లాభాల్లో ముగిసిన టాప్ ఫైవ్ షేర్ల లాభాలు నామమాత్రంగా ఉండటం విశేషం. నిన్న భారీగా నష్టపోయిన బ్రిటానియా ఇవాళ టాప్ గెయినర్. అయితే ఈ షేర్ 0.4 శాతం లాభంతో ముగియడం విశేషం. ఇక గ్రాసిం, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ షేర్లు కూడా చాలా తక్కువ లాభాల్లో ముగిశాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో హీరోమోటోకార్ప్ 4 శాతంపైగా క్షీణించింది.అలాగే ఎం అండ్ ఎం, హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్ షేర్లు కూడా ఒక మోస్తరు నుంచి భారీ నష్టాల్లో ముగిశాయి.