For Money

Business News

అందరి దృష్టి ఎన్నికలపై…

భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లన్నీ అమెరికా అధ్యక్ష ఎన్నికలవైపు చూస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే ఈ ఎన్నికలపై పలు రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికలకన్నా.. ఇంకా టెన్షన్‌గా ఉంది ఈసారి పరిస్థితి. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి హారిస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. రోజురోజూ సర్వేలు మారుతున్నాయి. ట్రెండ్స్‌ మారుతున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్ ట్రంప్‌ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఇటీవల బలపడుతున్న డాలర్‌, పెరుగుతున్న ఈల్డ్స్‌ అన్నీ ట్రంప్‌ అనుకూల సంకేతాలు. పలువురు స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు కూడా ఇలానే ఉన్నాయి. అయితే పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఫలితాలు తారుమారైతే దీని ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కమలా హారిస్‌ గెలిస్తే మార్కెట్‌ మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం ఉంటుందని కొందరు అనలిస్టులు అంటున్నారు. మరికొంత మంది ఎన్నికల ఫలితాలపై టెన్షన్‌తో ఉన్నారు. ఎవరో ఒకరికి స్పష్టమైన మెజారిటీ వస్తే సరే… లేకుండా గతంలో మాదిరి టెన్షన్‌ కొనసాగితే… మార్కెట్‌పై దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని అంటున్నారు. వెరశి ట్రంప్‌ స్పష్టమైన మెజారిటీ గెలిస్తే సరి… లేకుంటే మార్కెట్‌ నిలబడుతుందా అన్న అనుమానం ఉంది. అయితే టెక్‌ కంపెనీలు చాలా వరకు కమలాకు మద్దతుగా నిలిచాయి. ఇతర రాష్ట్రాల్లో గెలుపు ఎవరిదో తెలిసిపోతున్నా.. ఏడు రాష్ట్రాల్లో సస్సెన్స్‌ కొనసాగుతోంది. శనివారం వెలువడిన సర్వే ప్రకారం ట్రంప్‌ బలంగా ఉన్న ఐఓవా రాష్ట్రంలో కమల హారిస్‌ ముందంజలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ట్రంప్‌ చాలా సునాయాసంగా గెలిచారు. అయితే మరికొన్ని సర్వేలు హారిస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న రాష్ట్రాల సంఖ్య పెరగడంతో స్టాక్‌ మార్కెట్‌లో కూడా టెన్షన్‌ పెరుగుతోంది.