శుభారంభం…
సంవత్ 2081 శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టి 94 పాయింట్ల లాభంతో 24299 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 335 పాయింట్ల లాభంతో క్లోజైంది. నిన్న రాత్రి వాల్ స్ట్రీట్ భారీ నష్టాల్లో ముగిసినా ఇవాళ అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో మన మార్కెట్లలో పెద్దగా అమ్మకాల ఒత్తిడి కన్పించడం లేదు. అయితే నిన్న నాస్డాక్ 2.7 శాతంపైగా నష్టపోవడంతో ఇవాళ మన మార్కెట్లో ఐటీ షేర్లు నష్టాలతో ముగిశాయి. సెంటిమెంట్ వల్లనేమో నిఫ్టిలో 42 షేర్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం మూడున్నర శాతం లాభంతో నిఫ్టి టాప్ గెయినర్స్‌లో అగ్రభాగాన నిలిచింది. ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, బీఈఎల్, టాటా మోటార్స్ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక నష్టపోయినవాటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్‌లో ఉంది. హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ లూజర్స్‌లో ఉన్నా… నష్టాలు నామమాత్రమే. మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్లోని షేర్లకు ఇవాళ మంచి డిమాండ్ లభించింది.