ఆఫర్ ధరకు దిగువకు…
ఒలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ ఒక దశలో ఆఫర్ ధర కన్నా దిగువకు వచ్చేసింది. చివర్లో మార్కెట్‌తో పాటు కోలుకుని ఆఫర్ ధరకు ఎగువన అంటే రూ. 76.64 వద్ద ముగిసింది. పబ్లిక్ ఆఫర్ కింద షేర్లను రూ.76లకు ఒలా ఎలక్ట్రిక్ ఆఫర్ చేసింది. తరవాత ఈ షేర్ రెట్టింపు ధర పలికింది. గత ఆగస్టు 20వ తేదీన ఈ షేర్ రూ. 157.40ని తాకింది. అయితే కంపెనీపై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా వాహనాల సర్వీసింగ్ అధ్వాన్నంగా ఉందని, స్కూటర్లు తరచూ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. పలు చోట్ల వాహనాలు కాలిపోవడం, పలు చోట్ల సర్వీసింగ్ చేయడం లేదని చాలా మంది ఫిర్యాదు చేసినట్లు కథనాలు వచ్చాయి. దీంతో పాటు మార్కెట్ కూడా బలహీనంగా ఉండటంతో ఈ షేర్ క్రమంగా పడుతూ వచ్చింది. ఇవాళ ఇష్యూ ధరకు దిగువకు చేరి రూ. 74.84స్థాయికి వచ్చింది. ఆ తరవాత కోలుకుని రూ. 76.64 వద్ద ముగిసింది. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో 2.93 కోట్ల షేర్లు ట్రేడ్ కావడం విశేషం.