దుమ్మురేపుతున్న ఐటీ, టెక్ షేర్లు
అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఎకానమీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్ 0.18 శాతం నష్టాల్లో ఉండగా, ఐటీ టెక్ షేర్లు మాత్రం భారీ లాభాల్లో ఉన్నాయి. నాస్‌డాక్ ఏకంగా 1.26 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ500 సూచీ కూడా 0.56 పాయింట్ల లాభంలో ఉండటం విశేషం. డాలర్ స్థిరంగా ఉంది. డాలర్ ఇండెక్స్ 104పైన ట్రేడవుతోంది. ఇక బులియన్ మార్కెట్ కూడా స్తబ్దుగా ఉంది. ధరల్లో పెద్ద తేడా లేదు. అయితే క్రూడ్ ధరలు మాత్రం ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. వచ్చేవారం టెక్ షేర్ల పండుగ. పలు ప్రధాన కంపెనీలు వచ్చే వారం ఫలితాలు ప్రకటించనున్నాయి. మంగళవారం ఆల్ఫాబెట్‌తో టెక్ షేర్ల కార్పొరేట్ సీజన్ ప్రారంభం కానుంది. ఆ తరవాత బుధవారం మెటా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు మైక్రోసాఫ్ట్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఆ తరవాత గురువారం యాపిల్, అమెజాన్ కంపెనీల ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో టెక్, ఐటీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి.