అదానీకి కెన్యా కోర్టు షాక్
అదానీ గ్రూప్‌నకు కెన్యాలో భారీ షాక్ తగిలింది. వివాదాస్పద విద్యుత్ ప్రాజెక్టును ఆ దేశ హైకోర్టు నిలుపుదల చేసింది. కెన్యాకు చెందిన విద్యుత్ సంస్థతో అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎనర్జి సొల్యూషన్స్ అక్టోబర్ నెల ఆరంభంలో రూ. 6,250 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కెన్యా ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కంపెనీతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ ఒప్పందం కుదిరింది. కెన్యాలో విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం, ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పెద్ద ఉద్యమమే లేచింది. అయితే తరచూ విద్యుత్ కోతలను నివారించడం, ఆర్థికవృద్ధికి అదానీ ఒప్పందం సాయ పడుతుందని కెన్యా ప్రభుత్వం వాదించింది. అదానీతో ఒప్పందా్ని సవాలు చేస్తూ లా సొసైటీ ఆఫ్ కెన్యా అనే సంస్థ కెన్యా హైకోర్టులో కేసు వేసింది. ఈ 30 ఏళ్ళ ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని, రహస్యంగా కుదిరిన కళంకిత ఒప్పందమని కోర్టులో వాదించింది. వాదనలు విన్న కోర్టు… తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ముందుకు వెళ్ళొద్దని కెన్యా ప్రభుత్వాన్ని ఆదేశించింది.