For Money

Business News

టాటా వీలునామాలో శాంతను

ఇటీవల మృతి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా వీలునామా వివరాలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వెల్లడించింది. సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన ఈ వీలునామాలో శాంతను నాయుడు పేరు కూడా ఉండటం విశేషం. శాంతను నాయుడు గుడ్‌ఫెలోస్‌ అనే ఒక స్టార్టప్‌ ప్రారంభించారు. అందులో రతన్‌ టాటాకు వాటా ఉంది. అయితే వాటాలో భాగంగా ఆయన ఎంత పెట్టుబడి పెట్టారన్నది మాత్రం తెలియదు. అయితే తన వాటాను రతన్‌ టాటా వొదలుకుంటూ వీలునామాలో రాశారు. అలాగే విదేశాల్లో చదువుకునేందుకు అయిన ఖర్చును కూడా రతన్‌ టాటా రద్దు చేసినట్లు వీలునామాలో ఉన్నట్లు టైమ్స్ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ముంబైలోని జుహూ తారా రోడ్‌లో రెండస్తుల ఆలిబాగ్‌ బీచ్‌ బంగ్లా రతన్ టాటాకు ఉంది. అలాగే ఆయన పేరును రూ.350 కోట్ల ఫిక్సెడ్‌ డిపాజిట్లు ఉన్నాయి. అలాగే టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌లో రతన్‌ టాటాకు 0.83 శాతం వాటా ఉంది. 16,500 కోట్ల డాలర్ల (సుమారు రూ. 14 లక్షల కోట్లు) విలువైన టాటా సన్స్‌లో రతన్‌ టాటాకు ఉన్నవాటాను రతన్‌ టాటా ఎండోమెంట్‌ ఫౌండేషన్‌ పేరున బదిలీ చేయాలని రతన్‌ టాటా వీలునామాలో రాశారు. కొలాబాలోని హలేకాయ్‌ హౌస్‌ను, ఆలీ బాగ్‌ ఇంటిని రతన్‌ టాటా స్వయంగా డిజైన్‌ చేసి నిర్మించుకున్నారు. మరి వీటిని ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. రతన్‌ టాటాకు కార్లంటే చాలా ఇష్టం. ఆయన వద్ద 20 నుంచి 30 కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పుణె మ్యూజియంలో ఉంచుతారా లేదా వేలం వేస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. రతన్‌ టాటా వీలునామా అమలు ప్రక్రియ త్వరలోనే బాంబే హైకోర్టు ప్రారంభం కావొచ్చు. టాటా గ్రూప్‌లో తన పేరున వాటా తీసుకోవడానికి రతన్‌ టాటా ఇష్టపడలేదు. అందుకే ధనవంతుల జాబితాలో ఆయన పేరు ఉండదు. కాని కొన్ని లక్షల కోట్ల విలువైన ధనాన్ని, సేవలను ఆయన భారత సమాజానికి ఇచ్చి.. భారత రత్నగా మిగిలారు.

Leave a Reply