ఇంకా కొనొచ్చా?
ధన్‌తెరస్ వచ్చేస్తోంది. దీపావళి పండుగ చాలా మంది సెంటిమెంట్ పండుగ. ముఖ్యంగా వ్యాపారస్తులకు. ఇక స్టాక్ మార్కెట్‌లో ఉన్నవారికి కన్నా కమాడిటీస్ ట్రేడింగ్ చేసేవారికి ఈ పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈసారి వీరికి మంచి ప్రతిఫలాలు కూడా అందాయి. గత ధన్‌తెరస్ నుంచి ఈ ధన్‌తెరస్ మధ్య స్టాక్ మార్కెట్ (సెన్సెక్స్) 11 శాతం ప్రతిఫలం అందించగా. బంగారం 30 శాతంపైగా పెరిగింది. ఈ ఒక్క ఏడాదిలో అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 23 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్‌కు మించి రిటర్న్స్ వచ్చాయి బులియన్ మార్కెట్‌లో. గత ఏడాది ధన్ తెరస్ నాటికి పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ. 60,750 ఉండగా, ఇపుడు రూ. 80,000 దాటింది. గత ఏడాది రష్యా, ఉక్రయిన్ యుద్ధం నుంచి ఇపుడు పశ్చిమాసియా యుద్ధం వరకు బంగారం క్రమంగా పెరుగుతూ రావడం విశేషం.కరోనా తరవాత భారీ ఎత్తున మార్కెట్‌లోకి కరెన్సీ వచ్చింది. దీంతో అనేక దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని భారీ మొత్తంలో కొన్నాయి. దీంతో ధరలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి.
మరి ఇపుడు కొనొచ్చా?
చాలా మంది బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఈ ధర వద్ద కూడా బంగారాన్ని కొనమనే అంటున్నారు. ప్రతిఫలమే కాకుండా ఒక సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని పరిగణించాలని వీరు అంటున్నారు. బంగారం కన్నా ఈటీఎఫ్‌లలో పెట్టబడి పెట్టాలని అంటున్నా… భారతీయులకు నేరుగా బంగారం కొనడమే ఇష్టం. ఈక్విటీ మార్కెట్‌లో తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో బంగారంలో పెట్టుబడితో కొంత మేరకు డిరిస్క్ చేసుకోవచ్చని వీరు సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇపుడు ఔన్స్ బంగారం ధర 2700 డాలర్ల ప్రాంతంలో ఉంది. 2025లో 3000 డాలర్లకు బంగారం ధర చేరుతుందని చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే పది గ్రాముల బంగారం ఈజీగా లక్ష రూపాయలను దాటుతుందన్నమాట. షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్.. ఇలా పలు రంగాలకు తమ పెట్టబడులను విభజించాలని… అందులో కనీసం పది శాతం వరకైనా బంగారంలో పెట్టుబడి పెట్టాలని మార్కెట్ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.