For Money

Business News

మార్కెట్‌లో మిడ్‌ క్యాప్‌ టెన్షన్‌

నిఫ్టి కాస్త అటు ఇటుగా ఉన్నా… సాధారణ ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సాధారణ ఇన్వెస్టర్ల దగ్గర అధికంగా ఉండేవి మిడ్‌క్యాప్‌ షేర్లే. పైగా గత ఏడాది లేదా ఏడాదిన్నర నుంచి భారీ ప్రతిఫలాలు అందించిన షేర్లు కూడా ఇదే. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో మిడ్‌ క్యాప్‌ షేర్లను పెంచారు. ఇప్పటి వరకు బాగున్నా… గత నెల రోజుల నుంచి ట్రెండ్‌ రివర్స్‌లో కన్పిస్తోంది. నిఫ్టి పడకపోవడం, పడినా దిగువ స్థాయిలో మద్దతు వస్తుండటంతో తమ పోర్టుఫోలియోలోని మిడ్‌ క్యాప్స్‌ పడుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇపుడు నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్స్‌ దారుణంగా పడుతున్నాయి. గత నెలలో నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 100 సూచీలోని వంద షేర్లలో 78 షేర్లు 5శాతం పైగా క్షీణించాయి. వీటిలో బలహీనంగా, పుకార్లపై పెరిగిన షేర్ల ధరలు ఐస్‌ ముక్కలా కరిగిపోతున్నాయి. అనేక కౌంటర్లలో కొనేదారులే లేని పరిస్థితి కన్పిస్తోంది. ముఖ్యంగా ఫలితాలు సరిగా ఇవ్వని కంపెనీలను మార్కెట్‌ తీవ్రంగా క్షీణిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలను కూడా వొదల్లేటు. ఫలితాలు మార్కెట్‌ ఇంత తీవ్రంగా స్పందించడం ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదు. ఈ భయాల మధ్య మిడ్‌క్యాప్స్‌ నుంచి చాలా మంది ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నారు. కొందరు లాభాలను బుక్‌ చేసుకుంటుంటే.. మరికొందరు నష్టాలకు అమ్ముకుంటున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు సుమారు రూ. 80,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మారు. ఇవాళ కూడా వీరి నికర అమ్మకాలు రూ. 2000 కోట్లపైనే ఉన్నాయి. దీంతో పెద్ద పెద్ద షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి చూసి… సాధారణ ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. షార్ట్‌ కవరింగ్‌తో కొన్ని షేర్లు కోలుకున్నట్లు కన్పిస్తున్నా… మళ్ళీ పతనం అవుతున్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన పలు షేర్లకు ఈ బెడద తప్పడం లేదు. ట్రెంట్, టాటా కన్జూమర్‌ షేర్లలో ఇటీవల వచ్చిన అమ్మకాల ఒత్తిడి మామూలుగా లేదు. అలాగే బజాజ్‌ ఆటో, డిమార్ట్‌ షేర్లు… సాధారణ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. చైనా మార్కెట్‌ గ్రీన్‌లో ఉంటే మన మార్కెట్‌లో టెన్షన్‌ పెరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి పెట్టుబడులను చైనాకు తరలిస్తున్నారనే వార్తలే దీనికి కారణం. ఎలాగైనా నిఫ్టి 25000 స్థాయిని కాపాడుకుంటేనే ఈ పతనం ఆగుతుందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి గనుక 24700 స్థాయిని కోల్పోతే… పెద్ద పతనం ఖాయమని అంటున్నారు. నిఫ్టికి ఆ తరవాతి మద్దతు స్థాయి 24050 అని అంటున్నారు. 24700పైన కొనసాగితే 25000 స్థాయికి నిఫ్టి మళ్ళీ చేరడం సులభమని వీరు అంటున్నారు. మరోవైపు భారీ ఐపీఓలు వస్తుండటం, ఎఫ్‌ అండ్‌ ఓలో వస్తున్న కొత్త నిబంధనలు సాధారణ ఇన్వెస్టర్లను తికమకలో పడేశాయి.

Leave a Reply