For Money

Business News

మా షేర్‌ టార్గెట్‌ రూ.20,000

బజాజ్‌ ఆటో షేర్‌ ఇపుడు స్టాక్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది గైడెన్స్‌తో ఆ షేర్‌తో పాటు మొత్తం కన్జూమర్‌ డ్యూరబుల్‌, ఆటో షేర్లను ఘోరంగా దెబ్బతీసింది. బాజాజ్‌ ఆటో షేర్‌ ఏకంగా ఒకే రోజు 13 శాతంపైగా పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో పాటు కంపెనీ ఇచ్చిన గైడెన్స్‌తో చాలా బ్రోకింగ్‌ సంస్థలు ఈ షేర్‌ను డౌన్‌ గ్రేడ్‌ చేశాయి. అయితే ఇవాళ సీఎన్‌బీసీ టీవీ 18 ఛానల్‌తో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ మాట్లాడిన తరవాత ఈ షేర్‌ మూడు శాతం దాకా పెరిగింది. ఈ ఏడాది 53 శాతం దాకా పెరిగిన ఈ షేర్‌లో వచ్చిన అమ్మకాల తాకిడి ఇవాళ తగ్గి, డిమాండ్‌ వచ్చింది. తమ కంపెనీ షేర్‌ ధర ఎందుకు తగ్గిందో తనకు అర్థం కాలేదని, అయితే 12 నెలలో వంద శాతం షేర్‌ ధర పెరిగినందున.. స్వల్పంగా తగ్గడం సహజమేనని రాజీవ్‌ బజాజ్‌ అన్నారు. దీర్ఘకాలంలో తమ కంపెనీ షేర్‌ రూ. 20,000 లకు చేరుతుందన్న తన లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలిపారు. తాను స్టాక్‌ మార్కెట్‌ నిపుణుడిని కాకున్నా… తమ లాంటి షేర్‌ 20 శాతం తగ్గితే తాను కచ్చితంగా కొంటానని అన్నారు. దేశీయంగా కంపెనీ అమ్మకాల టర్నోవర్‌లో 20 శాతం ఇపుడు ఎలక్ట్రిక్‌ వాహనాల నుంచే వస్తోంది. అయితే ఈవీ మార్కెట్‌లో మార్జిన్స్‌ తక్కువగా ఉన్నందున… కంపెనీ మొత్తం మార్జిన్స్‌పై ప్రభావం పడిందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. 125 సీసీ ప్లస్‌ విభాగంలో పరిశ్రమ వృద్ధి రేటుకన్నా 40 శాతం అధిక వృద్ధిని తమ కంపెనీ సాధిస్తుందని రాజీవ్‌ బజాజ్‌ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ 47 లక్షల వాహనాలను అమ్ముతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంపెనీ ఎగుమతులు కూడా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.

Leave a Reply