For Money

Business News

అక్కడే తోక ముడిచింది

అనలిస్టులు ఊహించినట్లే నిఫ్టి తొలి ప్రతిఘటన వద్దే వెనక్కి మళ్ళింది. ఫార్మా, ఆటో, మెటల్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో గరిష్ఠ స్థాయి వద్ద నిఫ్టి నిలబడలేకపోయింది. ఆరంభంలోనే 25200 స్థాయిని దాటిన నిఫ్టి… అక్కడ నిలబడ లేకపోయింది. ఉదయం నుంచి దిగువస్థాయిలో పెద్దగా మద్దతు అందలేదు. పైగా ఏ కాస్త పెరిగినా ఒత్తిడి వచ్చింది. మిడ్‌ సెషన్‌లో 25008 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకి కాస్త కోలుకున్నా… లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. దీంతో క్రితం ముగింపుతో పోలిస్తే 70 పాయింట్ల నష్టంతో 25057 పాయింట్ల వద్ద ముగిసింది. 25000 స్థాయిని నిఫ్టి కాపాడుకున్నా… కొత్త గరిష్ఠ స్థాయిలను తాకాలంటే ముందుగా నిఫ్టి 25200 స్థాయిని చాలా పటిష్ఠంగా దాటాల్సి ఉంది. సెన్సెక్స్‌ కూడా 152 పాయింట్లు క్షీణించి 81,820 వద్ద ముగిసింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా బీపీసీఎల్‌ నిలిచింది. క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడంతో ఈ కౌంటర్‌లో ఆసక్తి వచ్చింది. ఆ తరవాతి స్థానాల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా, ఏషియన్‌ పెయింట్స్‌ నిలిచాయి. నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అగ్రభాగాన నిలిచింది.తరువాతి స్థానంలో ఉన్న విప్రో నిన్నటి లాభాలను దాదాపుగా పోగొట్టుకుంది. బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో కౌంటర్లు కూడా రెండు శాతంపైగా నష్టపోయాయి. ఇవాళ రియాల్టి షేర్ల సూచీ రెండు వాతం పెరగ్గా, మీడియా షేర్ల సూచీ 0.7 శాతం పెరిగింది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా ఒక శాతం పెరగడం విశేషం. ఇవాళ బీఎస్‌ఈలో 260కి పైగా షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకడం విశేషం.