For Money

Business News

టీసీఎస్‌ ఫలితాలు డల్‌

మార్కెట్‌ ఊహించినట్లే ఐటీ కంపెనీలు ఇంకా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఫలితాల సీజన్‌ను ఇవాళ ప్రారంభించిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌ మార్కెట్‌ వర్గాలను నిరాశపర్చింది. కంపెనీ ఆదాయం విషయంలో అంచనాలను అందుకున్నా… నికర లాభం విషయంలో మార్కెట్‌ అంచనాలను అందులేకపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 64,160 కోట్ల టర్నోవర్‌పై రూ. 12,422 కోట్ల నికర లాభం ఆర్జించిస్తుందని సీఎన్‌బీసీ టీవీ18 సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు అంచనా వేశారు. అయితే కంపెనీ రూ. 64,259 కోట్ల టర్నోవర్‌పై రూ. 11,909 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జులైతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కూడా ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ ఫలితాలు తీసికట్టుగా ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. జులైలో రూ.10 మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చిన కంపెనీ ఈసారి మరో రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని నిర్ణయించింది. దీనికి ఈనెల 18 రికార్డ్‌ డేట్‌ కాగా, నవంబర్‌ 5న డివిడెండ్‌ చెల్లిస్తారు. కంపెనీ కొత్త ఉద్యోగులను చేర్చుకుంటున్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,726 పెరిగిందని, దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,12,724కు చేరినట్లు టీసీఎస్‌ తెలిపింది. టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతి కారణంగా కంపెనీ ఎలాంటి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయలేదు. ఎనర్ఇ, రీసోర్సస్‌, యుటిలిటీ సెక్టార్ల నుంచి ఆదాయం వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది.

Leave a Reply