ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా MSP రామారావు
ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావును ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ఐడీబీఐ బ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ ఆయన ఫొటోతో సహా రుణ వివరాలతో బహిరంగ ప్రకటన చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ మాజీ ఎంపీ, స్వర్గీయ ఎంవీవీఎస్ మూర్తి కుమారుడైన ఎంఎస్పీ రామారావు కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ కంపెనీ రూ. 1,019 కోట్లు బకాయి ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా తీసింది. దీన్ని లిక్విడేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.ఈ ఏడాది జూన్ 21వ తేదీ నాటికి బ్యాంకుకు కంపెనీ రూ. 1019,38,61,603 బకాయి ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది. రుణాలు చెల్లించకపోవడంతో తనఖా కింద పెట్టిన భూముల వివరాలను వెల్లడిస్తూ… సదరు భూముల్లో ఎవరూ క్రయవిక్రయాలు చేయరాదని బ్యాంక్ హెచ్చరించింది.
భూమలు వివరాలు
తూర్పు గోదావరి దేవరపల్లిలోని 121 ఎకరాలను కంపెనీ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు బ్యాంక్ తెలిపింది. అలాగే ఆ భూముల్లో ఉన్న యంత్ర సామగ్రి, స్థిర, చర ఆస్తులు కూడా తమ ఆధీనంలో ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే ఇదే జిల్లా ఉప్పలగుప్తం మండలం సురసాని యానాం గ్రామంలో 54 ఎకరాలు, కొత్తపేట గ్రామంలోని 3 ఎకరాలు తమ ఆధీనంలో ఉన్నాయని బ్యాంక్ పేర్కొంది.