నిఫ్టిని కాపాడిన బ్యాంకులు
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా నిఫ్టి ఇవాళ అధిక స్థాయిలో నిలబడలేకపోయింది. వీక్లీ డెరివేటివ్స్ ఒక కారణం కాగా… హ్యుండాయ్ ఇండియా ఐపీఓ ఎఫెక్ట్ కూడా మార్కెట్‌పై కన్పిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయ సంస్థాగత సంస్థల కొనుగోళ్ళు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. అయినా సూచీలు రెడ్‌లో క్లోజ్ కావడానికి కారణం రీటైల్ ఇన్వెస్టర్ల అమ్మకాలే. హ్యుందాయ్ పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేయాలనుకున్న కొంత మంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క బ్యాంక్ నిఫ్టి మినహా మిగిలిన చాలా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్‌లో గట్టి ఒత్తిడి కన్పిస్తోంది. వీటి ఫలితంగా నిఫ్టి అధికస్థాయిలో నిలబడలేకపోయింది. నిఫ్టి ఆరంభంలోనే 25,134 పాయింట్లను తాకినా… తరవాత రోజంతా డల్‌గా సాగింది. క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. సెషన్ చివర్లో దాదాపు నష్టాల్లోకి జారుకునే సమయంలో నిఫ్టికి బ్యాంకుల నుంచి ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల నుంచి మద్దతు లభించింది. నిఫ్టి 16 పాయింట్ల లాభంతో 24998 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 164 పాయింట్లు లాభపడింది. నిఫ్టిలో ఇవాళ 23 షేర్లు లాభాల్లో క్లోజ్ కాగా, 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో కొటక్ బ్యాంక్ నిలిచింది. తరవాతి స్థానాల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీఈఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో సిప్లా టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో టెక్ మహీంద్రా, ట్రెంట్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ ఉన్నాయి.