For Money

Business News

మార్కెట్‌లో ఇంకా సెబి భయం

చాలా మంది ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ అంటే ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌. అయితే ఈ విభాగంపై ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సాధారణ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో ట్రేడింగ్‌ చేసి లక్షల కోట్లు నష్టపోతున్నారని సెబీ కూడా అంటోంది. దీంతో ఈ విభాగంలో సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోకుండా కొన్ని కీలక మార్పులు తేవాలని సెబి భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక కన్సల్టేషన్‌ పేపర్‌ను గత జులైలో విడుదల చేసింది. దీనిపై నిన్న తుది నిర్ణయం తీసుకుంటారని భావించారు. అయితే సెబీ నుంచి నిన్న ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఎఫ్‌ అండ్‌ ఓకు సంబంధించి సెబి ప్రకటన ఏక్షణమైనా రావొచ్చని ఇవాళ ఉదయం నుంచి మార్కెట్‌లో వార్తలు వస్తున్నాయి. బిజినెస్‌ ఛానల్స్‌ ఈ వార్తను ఇచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఎఫ్‌ అండ్‌ ఓ భయం ఇంకాపోలేదు. దీంతో నిఫ్టి కూడా ఇవాళ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. పడినపుడు మద్దతు లభించినా… అధిక స్థాయిలో మాత్రం షేర్ల సరఫరా వచ్చేస్తోంది. దీంతో లాభాలను నిఫ్టి నిలుపుకోలేదు. ఉదయం 25907 పాయింట్లను తాకినా… వెంటనే నష్టాల్లో జారుకుంది. 25739 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అక్కడ మద్దతు లభించినా.. నిఫ్టి 25800 స్థాయిని దాటలేకపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 14 పాయింట్ల నష్ఠంతో 25796 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌ షేర్లు మాత్రం ఇవాళ ఆకర్షణీయ లాభాలు గడించాయి. ఇవాళ ఐటీ షేర్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నిఫ్టిలో టెక్‌ మహీంద్రా టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో ఎం అండ్‌ ఎం, బ్రిటానియా, ఇన్ఫోసిస్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నిలిచాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌లో నిలిచింది. తరవాతి స్థానాల్లో ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌ నిలిచాయి.