పడకేసిన కీలక రంగాలు
ఆగస్టు నెలలో ఎనిమిది కీలక రంగాలు పడకేశాయి. ముఖ్యంగా విద్యుత్, బొగ్గు, ఎరువుల రంగం కూడా రాణించకపోవడంతో కీలక రంగాల వృద్ధి రేటు ఆగస్టులో 1.8 శాతానికి పడిపోయింది. జులై నెలలో ఈ ఎనిమిది రంగాలు 6.1 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. ముఖ్యంగా బొగ్గు రంగం వృద్ధి రేటు జులైలో 6.8 శాతం ఉండగా, ఆగస్టు నెలలో మైనస్ 8.1 శాతానికి కుప్పకూలింది. అలాగే విద్యుత్ రంగం వృద్ధి రేటు 7.9 శాతం నుంచి మైనస్ 5 శాతానికి క్షీణించింది. సిమెంట్ వంటి కీలక రంగం కూడా 5.5 శాతం నుంచి మైనస్ 3 శాతానికి పడిపోయింది. పారిశ్రామిక రంగానికి ఎంతో అవసరమైన స్టీల్ రంగంలో కూడా వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. అలాగే ఎరువుల రంగం వృద్ధి రేటు కూడా 5.3 శాతం నుంచి 3.2 శాతానికి క్షీణించింది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్‌లోనూ ఇదే పరిస్థితి. ఇక రిఫైనరీ ఉత్పత్తుల రంగం వృద్ధి రేటు కూడా 6.6 శాతం నుంచి మైనస్ ఒక శాతానికి క్షీణించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.