For Money

Business News

వచ్చే వారం ‘మహా కానుక’?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా క్షీణించడం, ఇదే సమయంలో డాలర్‌ కూడా పతనం కావడం భారత్‌కు బాగా కలిసి వచ్చిన అంశాలు. ఇవాళ కూడా ఆసియా దేశాలు కొనే బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 70 డాలర్లకు పడిపోయింది. గత వారం కూడా 70 డాలర్ల నుంచి 75 డాలర్లకు పెరిగిన క్రూడ్‌… క్రమంగా పడుతూ ఇవాళ 70 డాలర్లకు చేరింది. ఈనెల భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర 74 డాలర్లుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ధర మున్ముందు మరింత తగ్గే అవకాశముంది. దీంతో ప్రభుత్వ రంగ మార్కెటింగ్‌ కంపెనీలు ఇపుడు పెట్రోల్‌, డీజిల్‌పై లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ధరలతో పోల్చినప్పుడు చమురు కంపెనీల పెట్రోల్‌ ధరలు లీటర్‌కు రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని రీసెర్చి సంస్థ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.2 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీటి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇపుడు అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు తగ్గడం, అత్యంత కీలకమైన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గించవచ్చని సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. వచ్చే నెల 5వ తేదీలోగా ఈ రేట్ల తగ్గింపు ఉంటుందని వెల్లడించింది.