లిస్టింగ్‌లో అదరగొట్టిన టాప్ టెన్ షేర్లు
ఇవాళ బజాజ్ హౌసింగ్ లిస్టింగ్ లాభాలు ఇన్వెస్టర్లను ఆశ్చర్యపర్చాయి. ఏకంగా 135 శాతం లిస్టింగ్ లాభం ఇవ్వడంతో పాటు షేర్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇటీవల వంద శాతం లాభాలు ఇచ్చిన ఐపీఓల జాబితాను ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఇచ్చింది. వీటిలో చాలా కంపెనీల షేర్లు లిస్టింగ్ లాభాల కంటే అధిక లాభాలతో ట్రేడవుతున్నాయి. వాటిలో కొన్ని…
2021 నవంబర్‌లో లిస్టయిన సిగాచి ఇండస్ట్రీస్ అప్పట్లోనే ఇన్వెస్టర్లను లిస్టింగ్ లాభాలతో నివ్వెరపర్చింది. ఈ షేర్ ఐపీఓ ఆఫర్ ధర రూ. 163 కాగా రూ. 575 వద్ద ఈ షేర్ లిస్టయింది. అంటే లిస్టింగ్ లాభాలు 252 శాతాన్ని దాటాయన్నమాట.
డిఫెన్స్ షేర్ల హవా నడుస్తున్న సమయంలో లిస్టయిన పరస్ డిఫెన్స్ కూడా ఐపీఓ దరఖాస్తుదారులకు మంచి రిటర్న్‌ను ఇచ్చింది. ఈ షేర్ కూడా 2021 అక్టోబర్ 1న ప్రైమరీ మార్కెట్లోకి వచ్చింది. సెకండరీ మార్కెట్ లిస్టింగ్ రోజున ఈ షేర్ 171 శాతం లాభాన్ని ఇచ్చింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ. 175 కాగా, రూ. 475 వద్ద షేర్ లిస్టయింది.
లేటెంట్ వ్యూ అనలిటిక్స్ షేర్ కూడా 2021 నవంబర్ 23వ తేదీన లిస్టయింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ. 197 కాగా, రూ.530 వద్ద ఈ షేర్ లిస్టయింది. ఈ షేర్ 169 శాతం లాభాన్నిఇచ్చింది.
టాటా గ్రూప్‌నకు చెందిన టాటా టెక్నాలజీస్ షేర్ 2023 నవంబర్ 30న లిస్టయింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ. 500 కాగా.. ఈ కంపెనీ షేర్ రూ. 1199 వద్ద లిస్టయింది. అంటే 140 శాతం లాభం ఇచ్చిందన్నమాట. ఇపుడు ఈ షేర్ రూ.2000పైన ట్రేడవుతోంది.
ఇక బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ షేర్ ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన లిస్టయింది. ఈ షేర్ లిస్టింగ్ ధర రూ. 309 కాగా, కంపెనీ రూ. 135లకు షేర్లను అలాట్ చేసింది. లిస్టింగ్ లాభాలు 128 శాతం కాగా, తరవాత ఈ షేర్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది.ఈ షేర్ ఆగస్టు నెలలో రూ.205కు చేరి ఇపుడు రూ. 262 వద్ద ట్రేడవుతోంది.
ఈ నెల 3న లిస్టయిన ప్రీమియర్ ఎనర్జీస్ షేర్ కూడా ఇన్వెస్టర్లకు 120 శాతం లాభాన్ని తెచ్చి పెట్టింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ.450 కాగా, షేర్ రూ. 991 వద్ద లిస్టయింది. ఇపుడు రూ. 1100పైన ట్రేడవుతోంది.
2020 అక్టోబర్ 1న లిస్టయిన కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ కూడా ఇన్వెస్టర్లకు 114 శాతం లాభాన్ని ఇచ్చింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ. 340 కాగా, రూ. 730 వద్ద లిస్టయింది. ప్రస్తుతం ఈ షేర్ రూ. 279 వద్ద ట్రేడ అవుతుండటం విశేషం.
యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ షేర్ కూడా 112 శాతం లిస్టింగ్ లాభాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 13న లిస్టయిన ఈ షేర్ ఆఫర్ ధర రూ. 108 కాగా, రూ. 230 వద్ద లిస్టయింది. ఈ షేర్ ప్రస్తుతం రూ. 240పైన ఉంటోంది.
2020 సెప్టెంబర్ నెలలో పబ్లిక్ ఆఫర్ చేసిన హ్యాపియస్ట్ మైండ్స్ షేర్ కూడా మంచి లిస్టింగ్ లాభాలను ఇచ్చింది. ఈ షేర్ ఆఫర్ దర రూ. 166 కాగా రూ. 351 వద్ద ఈ షేర్ లిస్టయింది. ప్రస్తుతం ఈ షేర్ రూ. 800పైన ట్రేడవుతోంది.
2021 జులైలో ప్రైమరీ మార్కెట్‌కు వచ్చిన జీఆర్ ఇన్ఫ్రా కూడా 103 శాతం లాభాన్ని ఇచ్చింది ఇన్వెస్టర్లకు. ఈ కంపెనీ ఆఫర్ ధర రూ. 837 కాగా… షేర్ రూ. 1700 వద్ద లిస్టయింది. ప్రస్తుతం ఈ షేర్ రూ. 1639 వద్ద ట్రేడవుతోంది.