ఇవాళ ఏం జరిగిందంటే…
వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ఉన్నా.. ఆసియా మార్కెట్ల పతనం… నిఫ్టిని ఆరంభంలోనే నష్టాల్లోకి పడేసింది. ఆరంభమైన కొన్ని నిమిషాల్లోకి వచ్చిన నిఫ్టి… కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నా… ఆ తరనాత ఒత్తిడి తప్పలేదు. కాని రెండోసారి కోలుకున్న నిఫ్టి మిడ్‌సెషన్ వరకు చాలా పటిష్ఠంగా కన్పించింది. మిడ్‌సెషన్‌లో యూరో మార్కెట్ల నష్టాలతో పాటు అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉండటంతో…. సింటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. 12 గంటల నుంచి క్రమంగా అమ్మకాల ఒత్తిడి ఒకవైపు, లాభాల స్వీకరణ మరోవైపు సాగింది. దీంతో నిఫ్టి క్రమంగా లాభాలను కోల్పోవడమేగాక… నష్టాల్లోకి జారుకుంది. 3 గంటల ప్రాంతంలో నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 24885 స్థాయిని తాకింది. అక్కడి నుంచి నిఫ్టి స్వల్పంగా కోలుకుని 24950 వద్ద ముగిసింది. (తాత్కాలిక ముగింపు). క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 90 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ కూడా 398 పాయింట్ల నష్టంతో 81,523 వద్ద ముగిసింది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ విభాగం తప్ప మిగిలిన అన్న రంగాల సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిసింది. ప్రధాన సూచీల్లో నిఫ్టి మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.3 శాతంపైగా నష్టపోయాయి. ఇక నిఫ్టి టాప్ గెయినర్స్‌లో బజాజ్‌ఆటో టాప్‌లో నిలిచింది. తరవాతి స్థానాల్లో ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా మోటార్స్ టాప్‌లో ఉంది. బ్రోకరేజీ సంస్థలు ఈ షేర్ డౌన్‌గ్రేడ్ చేయడంతో ఈ షేర్ ఇవాళ 6 శాతం దాకా నష్టపోయింది. ఓఎన్‌జీసీ, విప్రో, ఎల్ అండ్ టీ, అదానీ ఎంటర్‌ప్రైజస్ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు భారీగా తగ్గినందున.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిందన్న వార్తలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. డౌజోన్స్ ఫ్యూచర్స్ 200 పాయింట్లు నష్టంతో ట్రేడవుతోంది. దీన్ని ఇవాళ మార్కెట్ డిస్కౌంట్ చేసింది. రాత్రికి డౌజోన్స్ ఇంతకన్నా తక్కువ నష్టంతో క్లోజైనా లేదా లాభాలతో ముగిస్తే… రేపు ఉదయం మన నిఫ్టి లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది.