క్రాస్ ఐపీఓ ధర ఖరారు
క్యాపిటల్ మార్కెట్‌లో కొత్త ఇష్యూల సందడి జోరుగా సాగుతోంది. ఒకవైపు ఎస్‌ఎంఈ సిగ్మంట్ సంచలనం రేపుతుంటే… సాధారణ ఐపీఓలు కూడా భారీ ప్రీమియంతో ఇన్వెస్టర్ల పంట పండిస్తున్నాయి. ఇపుడు అనేక కంపెనీ తమ వ్యాపార విస్తరణకు బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలకు బదలు ఐపీఓను ఆశ్రయిస్తున్నాయి. తాజాగా ఆటో విడిభాగాల తయారు చేసే కంపెనీ క్రాస్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ వచ్చే వారం మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ ఈనెల 9న ప్రారంభమై 11న ముగుస్తోంది. షేరు ధరల రేంజ్‌ను రూ.228- 240గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఆఫర్ ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. రీటైల్ ఇన్వెస్టర్లు కనీసం 62 (ఒక లాట్) షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అంటే కనీసం రూ. 14,880 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ ఈనెల 12న చేస్తారు. షేర్లు రాని వారికి ఆ తరవాతి రోజు అంటే 13 నిధులను తిరిగి ఇచ్చేస్తారు. అదే రోజున షేర్లు అలాటైన వారి ఖాతాల్లోకి షేర్లను జమ చేస్తారు. షేర్లు ఈనెల 16న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవుతాయి. ఈ ఇష్యూలో కొత్త షేర్ల జారీతో పాటు ప్రమోటర్లు తమ వాటాలోని కొంత భాగాన్ని అమ్ముకుంటున్నారు. రూ.250 కోట్లను కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా సమీకరిస్తుండగా, రూ.250 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత ప్రమోటర్లు అమ్ముతున్నారు. రూ.160 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సుధీర్ రాయ్, రూ.82 కోట్ల విలువైన షేర్లను మరో ప్రమోటర్ అనిత రాయ్ కలిగి ఉన్నారు. ఇష్యూ ద్వారా వచ్చే నిధులతో యంత్రాలు, రుణ చెల్లింపులు, కంపెనీ ఇతర కార్యకలాపాల కోసం వినియోగించనున్నట్లు క్రాస్ పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీకి జెంషెడ్‌పూర్‌లో అయిదు తయారీ కేంద్రాలు ఉన్నాయి.