జీఎస్టీ రేట్లు మారుతాయా?
వచ్చే నెల 9వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది.ఈ సారి అజెండా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ. జీఎస్టీ రేట్లు మరీ అధికంగా ఉన్నాయని దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో… రేట్ల హేతుబద్ధీకరణపై జీఎస్టీ కౌన్సిల్ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికపై వచ్చే సమావేశంలో చర్చించనున్నారు.బీహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ గ్రూప్ నాలుగు స్లాబుల్లో రేట్లు ఉండేలా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. రేట్లలో మార్పులు జరిగినా.. 5 శాతం, 12శాతం, 18 శాతంతో పాటు 28శాతం స్లాబుల్లో రేట్లు ఉండాలని కమిటీ సిఫారసు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జీఎస్టీ రేట్లపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. 2017తో పోలిస్తే (జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఏడాది) ప్రస్తుతం పన్నులు తక్కువగా ఉన్నాయని ఆమె అన్నారు. కేవలం జీఎస్టీ రేట్లపై సామాజిక మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆమె విమర్శించారు. జీఎస్టీ వల్ల అన్ని రాష్ట్రాలు లబ్ది పొందుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్లాబులను అలాగే ఉంచి… వస్తువులను ఇతర స్లాబుల్లోకి మారుస్తారా అన్నది చూడాలి.