For Money

Business News

రిలయన్స్‌- డిస్నీ డీల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మన దేశంలో అతి పెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య కుదిరిన మీడియా వ్యాపార విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (CCI) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల సీసీఐ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చినా… విలీనానికి నేడు ఆమోదం తెలిపింది. విలీనానికి కొన్ని సవరణలను సీసీఐ సూచించినట్లు తెలుస్తోంది. అయితే వాటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్, వాల్ట్‌ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్‌ ఇండియాల మధ్య ఇటీవలే 850 కోట్ల డాలర్ల అంటే సుమారు రూ. 70,550 కోట్ల డీల్‌ ఈ ఏడాదే కుదిరింది. ఈ విలీనం పూర్తయ్యాక కొత్త కంపెనీ చేతి కింద 120 టెలివిజన్‌ ఛానెళ్లు, రెండు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. విలీన సంస్థలో రిలయన్స్‌కు 63.16 శాతం వాటా ఉండగా, మిగిలిన 36.84 శాతం వాటా వాల్ట్‌ డిస్నీకి ఉంటుంది. కొత్త కంపెనీకి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్‌ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం రిలయన్స్‌ అతి పెద్ద వాటాదారుగా ఉన్న వయాకామ్‌ 18 కింద 40 టీవీ ఛానల్స్‌ ఉన్నాయి. ఇందులో కామెడీ సెంట్రల్‌, ఎంటీవీతో పాటు నికిలోడియన్‌ కూడా ఉంది. అలాగే డిస్నీ చేతిలో 80 ఛానల్స్‌ ఉన్నాయి. డిస్నీ స్టార్‌ కింద అనేక హిందీ సిరియల్స్‌తో పాటు హాలీవుడ్‌ మూవీస్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఇక వయాకామ్‌ 18 చేతిలో బీసీసీఐ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉండగా, ఐపీఎల్‌ హక్కులు డిస్నీ వద్ద ఉన్నాయి. దీంతో మొత్తం క్రికెట్‌ ప్రసార హక్కుల కొత్త విలీన సంస్థ చేతి కింద ఉంటాయన్నమాట. ఇక రిలయన్స్‌ జియో, డిస్నీ హాట్‌స్టార్‌ కింద దాదాపు 2 లక్షల గంటలకు పైగా డిజిటల్‌ కంటెంట్ ఉంది. వీటిలో టీవీ సీరియల్స్‌, సినిమాలు, స్పోర్ట్స్‌ కార్యక్రమాలు ఉన్నాయి.