జగన్ పెగాసస్ వాడారా?
జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసినట్లు టీడీపీ అధ్యక్షుడు, త్వరలోనే సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్న చంద్రబాబు అనుమానిస్తున్నారు. తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీ నుంచి చంద్రబాబు నివేదిక కోరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రాసింది. దీనికి సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఇంతకుమునుపు చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… పెగాసస్‌ను తనపై ఉపయోగించారని, యాపిల్ నుంచి ఈ మేరకు తనకు అలర్ట్‌లు వచ్చాయని నారా లోకేష్ అన్నారు. గత ఏడాది యువగళం పాదయాత్ర సమయంలో ఒకసారి, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా యాపిల్ నుంచి తనకు అలర్ట్‌లు వచ్చాయని ఆయన తెలిపారు. తమ ఫోన్లను ట్యాప్ చేసేందుకు జగన్ ప్రభుత్వ తమపై పెగాసస్‌ను ప్రయోగించిందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక తమ ప్రభుత్వం గద్దె దిగిపోతోందని తెలిసి… ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు. కొన్ని ఆఫీసుల్లో ఈ ధ్వంసం జరిగిందన్నారు. ఏయే సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారో తెలుసుకునేందుకు తాము పోలీస్ విచారణకు ఆదేశిస్తామని అన్నారు.