ఇపుడు బ్యాంక్ నిఫ్టి కొనొచ్చా?
స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా నిఫ్టికన్నా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. 2021 నుంచి నిఫ్టి వృద్ధి కన్నా.. ఈ రెండు సూచీల వృద్ధి రేటు చాలా జోరుగా ఉంది. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌లలో చాలా షేర్లు మూడు వందల నుంచి 400 వందల రెట్లు పెరిగాయి. ఇపుడు అనేక షేర్లలో భారీ కరెక్షన్ వస్తోంది. సూచీలు స్వల్పంగా క్షీణిస్తున్నా షేర్లలో మాత్రం భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. నిఫ్టికి ఇటీవల వెన్నుదన్నుగా ఉన్న బ్యాంక్ నిఫ్టి ఇపుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 50 రోజుల చలన సగటు (50 DMA)కు దగ్గరకు వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టి వరుసగా ఎనిమిదో సెషన్లో కూడా నష్టాలతో ముగిసింది. ఇవాళ 191 పాయింట్ల నష్టంతో 46,384 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి 50 DMA 46,000కి చాలా చేరువలో ఉంది. ఇండస్ ఇండ్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో ఇవాళ అమ్మకాల ఒత్తిడి రాగా… ప్రైవేట్ బ్యాంకుల్లో కాస్త ఆసక్తి కన్పిస్తోంది. ముఖ్యంగా 52 వారాల కనిష్ఠ స్థాయి వద్ద కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి షేర్లలో కొనుగోళ్ళు కన్పిస్తున్నాయి. 46,265 లేదా 46,150 ప్రాంతంలో బ్యాంక్ నిఫ్టికి మద్దతు లభించవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇకవేళ ఈ స్థాయి నుంచి కోలుకుంటే బ్యాంక్ నిఫ్టి 47000ని తాకే అవకాశముంది. ఒకవేళ 46వేల స్థాయిని కోల్పోతే మాత్రం 45,985కి సునాయాసంగా చేరుతుందని టెక్నికల్ఖ అనలిస్టులు అంటున్నారు. ఆసక్తి ఉన్న ట్రేడర్లు 46వేలు స్టాప్‌లాస్‌తో బ్యాంక్ నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని వీరు సలహా ఇస్తున్నారు.