దశ, దిశా లేని మోడీ బడ్జెట్
రైల్వే బడ్జెట్ ఎత్తేసిన తరవాత… దేశంలో ఏయే ప్రాంతాలకు ఎంతెంత రైల్వే బడ్జెట్ కేటాయించారో తెలియని పరిస్థితి. కేటాయించినా… అసలు నిధులు విడుదల చేశారా లేదా అన్నది మరో డైలమా. మొత్తానికి రైల్వే బడ్జెట్ ఇపుడు మోడీ లెక్కల ప్రకారం నడుస్తోంది. ఆయన అనుకున్న చోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆయన కనుసన్నల్లోని రాష్ట్రాలకు నిధులు వెళుతున్నాయి. మిగిలిన చోట్ల దుమ్ము, ధూళి పట్టిన రైల్వే స్టేషన్లకు పెయింట్లు వేసి… సోకు చేసి వదిలేస్తున్నారు. ఇపుడు బడ్జెట్దీ అదే పరిస్థితి. చాలా వరకు వస్తువులను జీఎస్టీలోకి తెచ్చేశారు. సుంకాలు ఏడాదికి డజన్ల సార్లు మారుస్తున్నారు. దీంతో బడ్జెట్లో సుంకాల మార్పులకు విలువ లేకుండా పోయింది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నదీ… ఏయే రాష్ట్రాలకు బడ్జెట్ నిధులు వెళుతున్నదీ బడ్జెట్ చెప్పడం లేదు. రైతుల జపం వినా… వాస్తవానికి జరిగిందేమీలేదు. ధరలు 10 శాతం దాకా పెరుగుతున్న సమయంలో బడ్జెట్లో కనీసం ఆ మాత్రం కూడా కేటాయింపులు పెరగడం లేదు. రుణాలు ఇవ్వడం కూడా గొప్పగా చెప్పుకునే దుస్థితికి కేంద్రం వచ్చింది. గత ఏడాది వ్యవసాయ రంగానికి రూ. 18 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం, ఈ ఏడాది రూ. 20 లక్షల కోట్లకు పెంచింది. అంటే పది శాతం పెరుగుదల అన్నమాట. సకాలంలో రుణాలు కడితే వడ్డీ లేదంటున్నారు. కాని రైతులు సకాలంలో రుణాలు కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పంట కొంటున్న రాష్ట్రాలే సకాలంలో నిధులు ఇవ్వడం లేదు.
ఈసారి తృణధాన్యాల భజన చేశారు. కాని కచ్చితంగా ఈ రంగానికి ఏం చేస్తారో మాత్రం చెప్పలేదు. అమృత్ కాల్ బడ్జెట్ అంటూ రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశ పట్టిన నిర్మలా సీతారామన్… వేతన జీవులకు చేసిందేమీ లేదు. పాత ఐటీ విధానంలో మార్పు లేదు. కొత్త విధానంలో టెలిస్కోపిక్ విధానంలో పన్ను లెక్కించే పద్ధతి పెట్టడం వల్ల… అదనంగా ఒరిగిందేమీ లేదు. పైగా కొత్త ట్యాక్స్ విధానంలో పలు మార్పులు చేసినా… ఉద్యోగులు ఇప్పటికే పాత పద్ధతికి మొగ్గు చూపేలా ఉన్నారు. దేశ ప్రజల పొదుపు సంస్కృతికి దెబ్బతీసే కొత్త ఐటీ విధానాన్ని ప్రమోట్ చేసేందుకు మోడీ ప్రభుత్వం తెగ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల బడ్జెట్ అంటూ తెగ పబ్లిసిటీ ఇచ్చిన నిర్మలమ్మ… కేవలం అంకెలు నింపడం వినా.. ఏ రంగానికీ ఊతం ఇవ్వలేదు.