అదానీ ముంచేసినా…
అదానీ షేర్లలో వచ్చిన సునామీని ఇవాళ మార్కెట్ తట్టుకుంది. మిడ్ సెషన్లో బడ్జెట్ తరవాత అకస్మాతుగా అదానీ షేర్లలో వచ్చిన అమ్మకాలకు మార్కెట్ భయభ్రాంతులకు లోనైంది. గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 1000 పాయింట్లు క్షీణించింది. ఈ పతనం ప్రధానంగా అదానీ షేర్ల కారణంగా వచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు కూడా భారీగా పతనం కావడంతో నిఫ్టి ఒకదశలో 17353 పాయింట్లకు క్షీణిచింది. చివర్లో ఇతర షేర్లలో వచ్చిన షార్ట్ కవరింగ్ కారణంగా నిఫ్టి 17616 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 45 పాయింట్లు నష్టపోగా, నిఫ్టినెక్ట్స్ 1.6 శాతం క్షీణించింది. బ్యాంక్ షేర్లు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్ క్యాప్ స్థిరంగా ముగిసింది. అదానీ షేర్లలో వచ్చిన అమ్మకాల హోరుతో మార్కెట్ ఠారెత్తిపోయింది. చివరికి అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ షేరైన అదానీ ఎంటర్ప్రైజస్లో కొనుగోలుదారులు కూడా లేకపోవడం కన్పించింది. ఈ షేర్ 27 శాతం నష్ఠంతో క్లోజ్ కాగా, అదానీ పోర్ట్స్ 17.73 శాతం నష్టపోయింది. నిఫ్టిని ఐసీసీఐసీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా స్టీల్ వంటి షేర్లు కాపాడాయి.