వైజాగ్ స్టీల్ విక్రయ ప్రక్రియ సాగుతోంది
వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ప్లాంట్ విక్రయ ప్రక్రియ సాగుతోందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. శుక్రవారం జరిగిన సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాటా విక్రయం కోసం కార్యాచరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. వైజాగ్ స్టీల్‌తో పాటు ఆ కంపెనీకి ఇతర కంపెనీల్లో వాటా,అనుబంధ సంస్థలను కూడా అమ్మేస్తామని పాండే తెలిపారు.వైజాగ్ స్టీల్‌ను అమ్మేయాలని 2021 జనవరిలో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. వైజాగ్ స్టీల్ అమ్మకాన్ని ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో సెయిల్‌లో ఆర్ఐఎన్ఎల్ను విక్రయానికి బదులుగా విలీనం చేయాలని కూడా ఈ సంఘాలు ప్రతిపాదించాయి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని తిరస్కరించింది.