జొమాటోలోనూ ఉద్యోగుల తొలగింపు
అంతర్జాతీయ మార్కెట్లోనే కాని దేశీయంగా కూడా పలు కంపెనీలు మాంద్యానికి సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీల వ్యాపారాలు మందగిస్తున్నాయనే వార్తలతో కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి పలు దిగ్గజ టెక్ కంపెనీలు ఇటీవల ఉద్యోగులపై వేటు వేస్తుండగా తాజాగా దేశీయంగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ ఉద్యోగుల్లో మూడు శాతం మందిని తొలగించనున్నట్టు వార్తలు వచ్చాయి. జొమాటోలో టెక్నాలజీ, ప్రోడక్ట్, మార్కెటింగ్ విభాగాల్లో లేఆఫ్స్ ప్రభావం అధికంగా ఉంటుందని ఓ వార్తాసంస్ధ పేర్కొంది. ఉ 2020 మేలో జొమాటో సిబ్బందిలో 13 శాతం దాదాపు 520 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు కంపెనీలో నాలుగున్నరేళ్ళ ప్రస్ధానం తరవాత జొమాటో సహ వ్యవస్ధాపకుడు మోహిత్ గుప్తా కంపెనీ నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో షేర్ ధర నిన్న రెండు శాతంపైగా క్షీణించింది.