For Money

Business News

దొరికింది కోటి రూపాయలే

గత రెండు రోజుల నుంచి తెలుగు ఛానల్స్‌ గ్రానైట్స్‌ కుంభకోణంపై నాన్‌ స్టాప్‌ కవరేజీ ఇస్తున్నాయి. తీరా ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన ప్రకటన చూస్తే… ఛానల్‌ చాలా అతిగా స్పందించాయనిపిస్తోంది. ఈనెల 9, 10 తేదీల్లో తాము శ్వేత గ్రానైట్స్‌, శ్వేత ఏజెన్సీస్‌, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌, పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, అరవింద్‌ గ్రానైట్‌స్, గిరిరాజ్‌ షిప్పింగ్‌తో పాటు సంబంధిత పలు కంపెనీలపై దాడులు చేసి సోదాలు నిర్వహించినట్లు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్‌, కరీంనగర్‌లలో ఈ దాడులు చేశామని.. ఫెమా ఉల్లంఘనలకు సాక్ష్యాలను సేకరించామని పేర్కొంది. కరీంనగర్‌ నుంచి చైనా, హాంగ్‌కాంగ్‌తో పాటు ఇతర దేశాలకు ముడి గ్రానైట్‌ ఎగుమతి అయినట్లు ఈడీ పేర్కొంది. ఎగుమతి చేసిన గ్రానైట్‌ కంటే తక్కువ పరిమాణాన్ని లెక్కల్లో చూపారని పేర్కొంది. అధికంగా సరఫరా చేసి గ్రానైట్‌ సొమ్మును చైనా కంపెనీల ద్వారా మళ్ళీ భారత్‌కు బ్లాక్‌ మనీ తెచ్చుకున్నారని ఈడీ పేర్కొంది. తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల ఖాతాల్లో భారీ మొత్తాన్ని బదిలీ చేశారని ఈడీ వెల్లడించింది. తాము జరిపిన దాడుల్లో రూ. 1.08 కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. గ్రానైట్‌ అక్రమ రవాణాతో ఈ హవాలా సొమ్ము అందిందని తెలిపింది. పనామా లీక్స్‌లో ఉన్న చైనా వ్యాపారి లి వెన్‌హూకి చెందిన కంపెనీల నుంచి నిధులు వచ్చాయని ఈడీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తయారు చేసిన నివేదిక ఆధారంగా తాము దాడులు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.