వాలస్ట్రీట్‌లోనూ కుప్పకూలిన చైనా షేర్లు
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పాలనపై మరింత పట్టు బిగించడంతో ఆదేశంలోని ప్రైవేట్ బ్లూచిప్ కంపెనీల షేర్ల భారీగా పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి రేటు అంతంత మాత్రమే ఉన్నా… చైనా విధానాలు ఆ దేశ ప్రైవేట్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జిన్‌పింగ్ ప్రైవేట్ కంపెనీలపై ఉక్కుపాదం మోపారు. జాక్ మా వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గారు. మరోవైపు విద్యారంగానికి చెందిన యాప్‌లో విధించిన ఆంక్షలతో అనేక కంపెనీలు దివాలా తీశాయి. ప్రభుత్వంపై జిన్‌పిన్ ప్రభావం తగ్గిందని… అతను గృహ నిర్భంధంలో ఉన్నారంటూ వచ్చిన వార్తలతో మున్ముందు ప్రైవేట్ పారిశ్రామివేత్తలు మరింత బలపడుతారని భావించారు. అయితే తాజాగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరోలో తన మద్దతుదారుల సంఖ్యను జిన్‌పింగ్ బాగా పెంచారు.
స్వేచ్ఛా వ్యాపార సంస్థలకు మద్దతిచ్చేవారికి ఏడుగురు సభ్యులుగల స్టాండింగ్ కమిటీలో చోటు దక్కలేదు. మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌ను కూడా ఈ కమిటీ నుంచి తప్పించేశారు. దీంతో ఇవాళ ఉదయం చైనా మార్కెట్లు మూడు శాతందాకా క్షీణించగా, హాంగ్‌సెంగ్ సూచీ ఆరు శాతంపైగా క్షీణించింది. ఇవాళ ఉదయం చైనా మార్కెట్ల నష్టాలకు 900 కోట్ల డాలర్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ కంపెనీలు కోల్పోయాయి. హాంగ్‌కాంగ్‌లో లిస్టయిన అనేక చైనా కంపెనీలు అమెరికాలో కూడా లిస్టయ్యాయి. అమెరికా మార్కెట్‌లో ఈ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. అలిబాబా షేర్ 14శాతం, బైదూ షేర్ 17 శాతంపైగా క్షీణించాయి. ఐషేర్స్ ఎంఎస్‌సీఐ చైనా ఈటీఎఫ్ సూచీ 10 శాతంపైగా క్షీణించింది.