లాభాల్లో ముగిసిన నిఫ్టి
అమెరికా మార్కెట్లపై ఆశతో నిఫ్టి స్వల్ప లాభంతో ముగిసింది. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న నిఫ్టి మిడ్ సెషన్లో కొద్దిసేపు లాభాల్లోకి ఉంది. మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నా…సరిగ్గా 2.30 తరవాత మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. యూరో మార్కెట్ల నష్టాలు స్వల్పంగా ఉండటం, అమెరికా ఫ్యూచర్స్ నష్టాలన్నీ తగ్గి… సూచీలు గ్రీన్‌లో రావడంతో నిఫ్టి 17563 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో క్లోజైంది. ఉదయం నుంచి నిఫ్టిలో ఐటీ షేర్ల హవా కొనసాగినా.. చివరల్లో అదానీ గ్రూప్ షేర్లలో ఊపు వచ్చింది. అలాగే యూపీఎల్ ఏకంగా అయిదు శాతం లాభంతో నిఫ్టి టాప్ గెయినర్‌గా మారింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ 2.5 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టి తరవాత కేవలం నిఫ్టి నెక్ట్స్ ఒక శాతం లాభంతో ముగిసింది. అయితే నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీ 0.7 శాతం నష్టంతో ఉంది. అలాగే నిఫ్టి బ్యాంక్ కూడా అదే స్థాయి నష్టాలతో ముగిసింది. బ్యాంక్ షేర్లలో పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు శాతంపైగా లాభం పొందాయి.