సగం మంది ఉద్యోగుల తొలగింపు
క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం భారీగా పన్నలు విధించడంతోపాటు ఐటీ, ఈడీ అధికారులు దాడులు పెంచాయి. అనేక కంపెనీల్లో నిధులను విదేశాలకు తరలించినట్లు వెల్లడి అవుతోంది. దీంతో ఈడీ గట్టి చర్యలు తీసుకుంటోంది. పలు కంపెనీల ఆస్తులను కూడా జప్తు చేస్తోంది. పైగా క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా ఈక్విటీ మార్కెట్ మాదిరిగా డల్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా క్రిప్టో కరెన్సీకి దూరంగా ఉంటున్నారు. ముందున్న క్రేజ్ ఇపుడు లేదు. దీంతో ఈ రంగంలో భారీగా విస్తరించాలని భావించిన కంపెనీలు ఇపుడు పునరాలోచనలో పడ్డాయి. ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ `వజీర్ఎక్స్` కూడా తన విస్తరణ యోచనను పక్కన బెట్టింది. ఉన్న ఉద్యోగుల్లో 40 శాతం మంది సిబ్బందిని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ టర్నోవర్ భారీగా తగ్గడంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోక తప్పడం లేదు.
2021 అక్టోబర్ 28న గరిష్ఠంగా 47.8 కోట్ల లావాదేవీలు జరగ్గా… గత శనివారం (2022 అక్టోబర్ 1) 15 లక్షల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.`వజీర్ఎక్స్`లో 150 మంది పని చేస్తునండగా… వారిలో 50 నుంచి 70 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగులకు గతవారాంతంలో కంపెనీ సమాచారం ఇచ్చింది. వారికి 45 రోజుల వేతనం చెల్లించి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.