For Money

Business News

ఐఫోన్ 14కు అంత డిమాండ్‌ లేదు

ఈనెలలో కొత్తగా మార్కెట్‌లో వచ్చిన ఐఫోన్ 14 సిరీస్‌ అమ్మకాలు ఆశాజ‌న‌కంగా లేవు. దీంతో వీటి ఉత్పత్తి తగ్గించాలని యాపిల్ యోచిస్తోంద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మాంద్యం ముసుకుంటున్న సమయంలో ఐఫోన్ 14 ఉత్పత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కంపెనీ భావిస్తోంది. ఐఫోన్ 14కు అదనపు ఫీచర్లు గొప్పగా లేకపోవడంతో పాటు ఐఫోన్ 13 సిరీస్‌ చాలా త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు కొత్త ఫోన్‌ పట్ల ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ సంద‌ర్భంగా ఐఫోన్ 13పై ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రూ 20,000 వ‌ర‌కూ డిస్కౌంట్ ఇస్తుండ‌టంతో ఈ స్మార్ట్‌ఫోన్ స్టాక్ అయిపోయింది. మరో ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్ సేల్‌లోనూ ఐఫోన్ 13కు అనూహ్య డిమాండ్ వచ్చిందని… ఆ కంపెనీ కూడా నో స్టాక్‌ బోర్డు పెట్టాల్సి వస్తోందని తెలుస్తోంది. కొత్త మోడల్‌లో ఐఫోన్ 14 ప్రొకు మంచి ఆదరణ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్‌ 14 ప్రొ మోడ‌ల్స్‌లో యాపిల్ కొన్ని కీల‌క మార్పుల‌ను చేయడంతో ఈ మోడ‌ల్స్‌ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.