For Money

Business News

వడ్డీ తక్కువ.. వెంటనే రుణం

వెంటనే డబ్బు అసవరమైన వారికి అతి తక్కువ వడ్డీతో మూడు నాలుగు విధాలుగా స్వల్ప కాలిక రుణాలు లభించే మార్గాలు ఉన్నాయి. కాస్త సేవింగ్స్‌ ఉన్నవారికి మరీ ఇబ్బంది లేకుండా రుణం పొందవచ్చు.

శాలరీ ఓవర్‌డ్రాఫ్ట్‌
ఉద్యోగులైతే.. బ్యాంకు నుంచి మీ జీతానికి మూడు రెట్ల వరకు శాలరీ ఓవర్ డ్రాఫ్ట్‌ (ఓడీ) లభిస్తుంది. సాధారణంగా ఈ ఓడీ 12 నెలలకు వస్తుంది. మీరు వాడుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అలాగే కట్టే వరకే వడ్డీ వసూలు చేస్తారు. వెంటనే కట్టేసి ఈ భారం తగ్గించుకోవచ్చు. ఇది ఈఎంఐ కాదు. ప్రతినెలా మీరు వడ్డీ కడితే సరిపోతుంది. వొద్దనుకుంటే, మీకు మరో మార్గం నుంచి సొమ్ము వస్తే వెంటనే కట్టేయొచ్చు కూడా. ముందే కట్టేసినందుకు పెనాల్టి ఉండదు. ఎలాంటి పత్రాలు లేకుండా, గ్యారంటీ లేకుండా బ్యాంకుల నుంచి ఈ రుణం తీసుకోవచ్చు.
పే డే లోన్స్‌
వచ్చే నెల జీతం పడే వరకు మీరు పే డే లోన్‌ తీసుకోవచ్చు. చాలా తక్కువ వ్యవధికి, తక్కువ మొత్తంలో అందే రుణమిది. ఒక్కసారే అసలు, వడ్డీ కూడా తీసేసుకుంటారు. శాలరీ అకౌంట్‌ కాబట్టి.. జీతం పడగానే ఆటోమేటిగ్గా కట్‌ అయిపోతుంది.
ఎఫ్‌డీలపై లోన్‌
మీకు లేదా మీ ఇంట్లో ఎవరి పేరునైనా ఫిక్సెడ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) ఉంటే … వాటిపై కూడా లోన్‌ తీసుకోవచ్చు. ఎఫ్‌డీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కొనసాగుతూనే ఉంటుంది. పైగా ఈ లోన్‌కు కూడా పేపర్‌ వర్క్‌ తక్కువ. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ మొత్తంలో 90 శాతం వరకు రుణం ఇస్తాయి. దీన్ని మీరు లోనుగా తీసుకోవచ్చు లేదా ఓడీగా కూడా తీసుకోవచ్చు. వడ్డీ తక్కువే ఉంటుంది.
కోవిడ్‌ లోన్‌
ఇది ఎస్‌బీఐ మాత్రం ఆఫర్‌ చేస్తోంది. కోవిడ్‌ బాధితులు ఈ రుణం తీసుకోవచ్చు. ఏప్రిల్‌ 1న లేదా ఆ తరవాత కోవిడ్‌ సోకినవారికి మాత్రమే ఈ రుణం ఇస్తారు. కరోనా సంబంధిత చికిత్సకు ఈ రుణం తీసుకోవచ్చు. తమ ఖాతాదారులకు ఎస్‌బీఐ ఈ ఆఫర్‌ ఇస్తోంది. శాలరీ అకౌంట్‌ ఉన్నా, లేకున్నా పెన్షనర్లకు కూడా ఈ రుణం ఇస్తారు. ఈ లోన్‌కు ఎలాంటి జామీను అక్కర్లేదు.
మ్యూచువల్ ఫండ్‌ లోన్
మీ దగ్గర మ్యూచువల్ ఫండ్‌ యూనిట్లు ఉన్నా.. సులభంగా రుణం తీసుకోవచ్చు. తక్కువ వ్యవధిలో రుణం కావాలనుకునేవారికి ఇది బాగానే ఉంటుంది. చాలా బ్యాంకులు ఈ సౌకర్యం అందిస్తున్నాయి. రుణ లేదా ఈక్విటీ ఫండ్‌ యూనిట్లపై కూడా రుణం ఇస్తారు. ఎఫ్‌డీతో పోలిస్తే తక్కువ శాతం రుణం వస్తుంది. తమ వద్ద మ్యూచువల్ ఫండ్‌ యూనిట్లను అమ్మకుండా… నిధుల సమస్య తీర్చుకోవడానికి ఇదొక మార్గం. యూనిట్లను తాకట్టు పెట్టి ఓడీ కింద లోన్‌ తీసుకోవచ్చు. అంటే మీరు ఎపుడు అవసరమైతే అపుడు లోన్‌ తీసుకుని, ఆ కాలానికే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.