For Money

Business News

భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈసారి కూడా అంటే వచ్చే నెలలో భారీగా వడ్డీ రేట్లను పెంచుతుందన్న వదంతులతో మార్కెట్‌లో భారీ ఒత్తిడి వస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 108ని దాటడంతో ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి బాగా పెరిగింది. అమెరికా మార్కెట్లలో శుక్రవారం మొదలైన ఈక్విటీ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ ఒక శాతంపైగా నష్టంతో ఉండటం, యూరో మార్కెట్లు కూడా ఒక శాతంపైగా నష్టపోవడంతో… మన మార్కెట్లలో ఏ కోశానా మద్దతు లభించలేదు. నిఫ్టి ఒకదశలో 17467ని తాకినా.. చివర్లో స్వల్పంగా కోలుకుని 17490 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 267 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్‌ 872 పాయింట్లు పడిపోయింది. నిఫ్టిలో ఏకంగా 45 షేర్లు నష్టాల్లో ముగిశాయి. పెరిగిన షేర్లలో లాభాలు నామ మాత్రమే. నిఫ్టి టాప్‌లూజర్స్‌లో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, దివీస్‌ ల్యాబ్‌ ఉన్నాయి. ఉదయం లాభాల్లో అదానీ గ్రూప్‌ షేర్లు తరవాత బాగా తగ్గాయి. అదానీ గ్రీన్‌ ఒక్కటే 5.5 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి ఒకటిన్నర శాతం క్షీణించగా. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ రెండు శాతంపైగా తగ్గింది. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి బ్యాంక్‌ పరిస్థితి అలానే ఉంది. ఇవాళ భారీగా నష్టపోయిన ఇతర షేర్లలో జూబ్లియంట్ ఫుడ్స్‌, నౌకరీ, అదానీ ట్రాన్స్‌, హావెల్స్‌, సెయిల్‌ ఉన్నాయి. బ్యాంక్‌ షేర్లలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మూడు శాతం దాకా నష్టపోయింది. ఉదయం టాప్‌ కాల్స్‌లో పేర్కొన్న చాలా షేర్లు మంచి లాభాలను ఇచ్చాయి.