బజాజ్ ఫైనాన్స్ నికర లాభం డబుల్
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ. 2,596 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.1,002. ఏడాదిలో నికర లాభం రెట్టింపు అయ్యిందన్నమాట. నిజానికి కంపెనీ నికర లాభం అనూహ్యంగా పెరగడానికి ప్రధాన కారణం రుణ నష్టాల కోసం కేటాయింపులు రూ.1,750 కోట్ల నుంచి రూ.755 కోట్లకు తగ్గాయి. కంపెనీ నిరర్థక ఆస్తులు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపింది.
కంపెనీ మొత్తం ఆదాయం రూ. 6,743 కోట్ల నుంచి జూన్ త్రైమాసికంలో 38 శాతం పెరిగి రూ. 9,283 కోట్లకు చేరిందని బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. కస్టమర్ల సంఖ్య 20 శాతం పెరిగి 6.03 కోట్లకు చేరింది. ఈ ఒక్క త్రైమాసికంలోనే 27.3 లక్షల కస్టమర్లు పెరిగారు.గత ఏడాది జూన్ త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ. 5,954 కోట్లు ఉండగా, ఈ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 33 శాతం పెరిగి రూ. 7,920 కోట్లకు చేరుకుంది. కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 30 శాతం పెరిగి రూ. 2,04,018 కోట్లకు చేరినట్లు బజాజ్ ఫైనాన్స్ పేర్కొంది.