రోడ్ల కోసం షేర్ మార్కెట్ నుంచి నిధులు
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రోడ్ల ప్రాజెక్టుల నిధుల కోసం బ్యాంకులను ఆశ్రయించడం కన్నా.. క్యాపిటల్ మార్కెట్ నుంచి శ్రేయస్కరమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రానికి ఆర్థిక ఇబ్బందుల్లేవని, అయినప్పటికీ షేర్ మార్కెట్కు పోతున్నామని ఆయన అన్నారు. ధనికుల సొమ్మును వాడుకోవాలని మేమనుకోవడం లేదని, అందుకే అక్కడ చిన్నచిన్నవాళ్ల దగ్గర్నుంచి లక్ష, 2 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడుల్ని సేకరిస్తామని గడ్కరీ చెప్పారు. ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా 8 శాతం ప్రతిఫలం ఇచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలున్నప్పటికీ దేశీయ మౌలిక రంగ ప్రాజెక్టుల నిధులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇంధనం వాడకం గురించి ఆయన మాట్లాడుతూ … మిథనాల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, వాటి వినియోగంలోకి మారాలని కోరారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)దే భవిష్యత్తు అని గడ్కరీ అన్నారు. ఆటో మార్కెట్లో మన కంపెనీల వాటా పెరుగుతోందని… విదేశీ సంస్థల వాటా తగ్గుతోందని ఆయన అన్నారు.