ఎస్బీఐ వడ్డీరేట్ల పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ని 0.20 శాతం పెంచింది. ఈ పెంపు వెంటనే అమ్లలోకి వచ్చిందని బ్యాంక్ పేర్కొంది. ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ 7.20 శాతం నుంచి 7.40 శాతానికి సవరించింది. దీంతో వాహన, గృహ, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు మరింత పెరగనుంది. అలాగే ఒక్కరోజు-మూడేండ్లలోపు రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 7.05 శాతం నుంచి 7.70 శాతం మేర పెంచింది. రెపో రేటుతో లింక్ చేసిన రుణాలపై వడ్డీరేటుని కూడా సవరించి 6.65 శాతం నుంచి 7.15 శాతానికి పెంచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై కూడా వడ్డీరేటును పెంచింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 0.15 నుంచి 0.20 శాతం మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.