SGX Nifty: 300 పాయింట్లకు పైగా నష్టం
ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తతున్నాయి. బాండ్లలో, కరెన్సీ మార్కెట్లలో మంచి వడ్డీ గిట్టుబాటు అవుతున్నందున… ఈక్విటీ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు వైదొలగుతున్నారు. శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణ రేటు 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగాయి. డాలర్ మరింత బలపడింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల హోరులో సూచీలు కొట్టుకుపోయాయి. శుక్రవారం నాస్‌డాక్ 3.5 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.9 శాతం నష్టపోయాయి. ఇక డౌజోన్స్ కూడా 2.73 శాతం పడటంతో సంప్రదాయ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ నుంచి బయటపడుతున్నారు. ఇవాళ కూడా అమెరికా ఫ్యూచర్స్ మరో ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అంటే దాదాపు నాలుగున్నర శాతం నష్టంతో అమెరికా సూచీలు ఉన్నాయన్నమాట. అంతకుముందు శుక్రవారం యూరో మార్కెట్లలో కూడా అమ్మకాలు వెల్లువెత్తాయి. డాక్స్ మూడు శాతంపైగా నష్టపోయింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది. చైనా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ఉండగా… హాంగ్‌సెంగ్ మూడు శాతం నష్టంతో ఉంది. నిక్కీ కూడా 2.8 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 300 పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. ఈ స్థాయిలో కూడా అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. నిఫ్టి 15900 దిగువకు వెళుతుందేమో చూడాలి.