For Money

Business News

భారీగా పతనం కానున్న నిఫ్టి

ఈక్విటీ మార్కెట్లు ఇన్వెస్టర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అత్యంత పటిష్టమైన షేర్లు కూడా పేక మేడల్లా కూలిపోతున్నారు. కేవలం ప్రభుత్వ రంగ షేర్లు, లిక్విడిటీ తక్కువ ఉన్న షేర్ల ధరలను పెంచడం లేదా స్థిరంగా ఉంచడం ద్వారా సూచీలను అధిక స్థాయిలో ఉంచుతున్న ఆపరేటర్లు కూడా వచ్చే వారం చేతులెత్తేసే పని ఉంది. గురు, శుక్రవారాల్లో అమెరికా మార్కెట్ల పతనం … వర్ధమాన మార్కెట్లకు పీడకలగా మారుతోంది. గరిష్ఠ స్థాయి నుంచి సూచీలు ఏవైనా గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతం పడితే బేర్‌ ఫేజ్‌ ప్రారంభమైనట్లే. అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా నాస్‌డాక్‌ ఆ స్థాయికి చేరింది. ఇతర సూచీలు కూడా 20 శాతం తగ్గాయి. గత గురు, శుక్రవారాల్లో వచ్చిన పతనంతో బేర్ ఫేజ్‌ మొదలైనట్లే చెప్పాలి. ఇక ఆదివారం కూడా చాలా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. చమురు ధరలు అధికంగా ఉన్నా సౌదీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇక సింగపూర్‌ నిఫ్టి 445 పాయింట్లు నష్టపోయింది. మరి సోమవారం ట్రేడింగ్‌ సమయానికి ఎంత వరకు కోలుకుంటుందో చూడాలి. కాని రేపు 16,000 స్థాయిని నిఫ్టి కోల్పోవడం ఖాయంగా కన్పిస్తోంది. రేపు రూపాయి కూడా భారీగా క్షీణించే అవకాశముంది. దీంతో ఇపుడు నిఫ్టికి మద్దతు స్థాయి 15,800 కానుంది. వచ్చే వారం చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండమని టెక్నికల్‌ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి…
విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 1.83 లక్షల కోట్ల విలువైన షేర్లను అమ్మారు. గతవారం వచ్చిన అమెరికా సీపీఐ డేటా చూసిన తరవాత ఫెడరల్‌ రిజర్వు భారీగా వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే రూపాయి కూడా భారీగా తగ్గతుంది. రూపాయి బలహీనపడితే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ తగ్గుతోంది. పైగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నందున… విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను మరింత పెంచే అవకాశముంది. ఏ విధంగా చూసినా వచ్చేవారం మార్కెట్లకు చుక్కలు కన్పించేలా ఉంది.