మద్య నిషేధానికి శాశ్వత సమాధి
మద్య నిషేధం నినాదంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి… మద్య నిషేధానికి శాశ్వత సమాధి కట్టారు. తానే కాదు.. మున్ముందు ఎవరు అధికారంలోకి వచ్చినా… మద్యం కొనసాగించాల్సిన పరిస్థితి తెచ్చి పెట్టారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రభుత్వం ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా మార్కెట్ నుంచి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)ల ద్వారా రూ. 8000 కోట్ల అప్పు చేసింది. భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ కట్టకపోతే.. అసలు, వడ్డీ తానే కడుతానని రాష్ట్ర ప్రభుత్వం హామి ఇచ్చింది. పైగా 9.5 శాతం వడ్డీతో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో బాండ్స్ జారీ చేశారు. అంటే సగటు ఏడాదికి వడ్డీ పది శాతం దాటిపోతుందన్నమాట. తాము మద్యం నిషేధం విధించమని బాండ్స్ జారీ సమయంలో హామి ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఒకవేళ మద్య నిషేధం గనుక విధిస్తే మొత్తం అసలు, వడ్డీని .. నిషేధం ప్రకటన వచ్చిన మూడు నెలల్లోగా తిరిగి చెల్లిస్తామని హామి ఇచ్చింది. ఇపుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి మిగులు ఆదాయం రాష్ట్రానికి ఉండదు. అంటే కచ్చితంగా మద్య నిషేధం అమలు చేయాల్సింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మద్య విధానం కొనసాగించాల్సిందే. ఒకవేళ వారు వొద్దనుకుంటే ఈ మొత్తం రుణం, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరోలా చెప్పాలంటే.. ఏపీలో సమీప భవిష్యత్తులో మద్య నిషేధం అమలు కాకుండా శాశ్వత సమాధి కట్టేశారన్నమాట. పైగా భారీ మొత్తంలో రుణం తెచ్చినందున ఏ ప్రభుత్వమైనా సరే… కనీనం ఇపుడున్న స్థాయిలో మద్యం అమ్మాల్సిందే. లేదంటే సాధారణ పద్దుల నుంచి అంటే ఇతర ఖర్చులు తగ్గించి… మద్యం బాండ్ల అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ ఖాతాల్లో గత రెండేళ్ళ నుంచి రూ. 1400 కోట్ల రుణం ఉండనే ఉంది. సో.. మొత్తానికి ఇపుడు కార్పొరేషన్ ఖాతాలో రూ. 9400 కోట్ల రుణం ఉందన్నమాట.