For Money

Business News

ఆరు ఐపీఓలు, 14 లిస్టింగ్‌లు

సెకండరీ మార్కెట్‌తో పాటు ప్రైమరీ మార్కెట్‌ కూడా గత కొన్ని నెలలుగా కళకళలాడుతోంది. ఈ ఏడాది చివరి వారంలో కూడా మార్కెట్‌లో కొత్త ఐపీఎల్‌లు హల్‌చల్‌ చేయనున్నాయి. రేపు అంటే డిసెంబర్‌ 25న మార్కెట్‌కు సెలవు. వారంలోగా మరో ఆరు కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించనున్నాయి. వస్తున్న ప్రతి పబ్లిక్‌ ఇష్యూ బంపర్‌ లాభాలతో లిస్ట్‌ అవుతుండటంతో… ఇన్వెస్టర్ల నుంచి అదే స్థాయిలో స్పందం వస్తోంది. ఏకంగా వంద రెట్లకు పైగా సబ్‌స్క్రయిబ్‌ అవుతున్నాయి. లిస్టింగ్‌ లాభాలు 75శాతం 100శాతం దాటుతున్నాయి. ఈనెల 26వ తేదీన మూడు ఐపీఓలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతున్నాయి. 26న మోటిసన్స్‌ జ్యువెలర్స్‌, ముతూట్‌ మైక్రోఫిన్‌, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ లిస్ట్‌ కానున్నాయి. ఎస్‌ఎంఈ విభాగంలో కూడా సహారా మేరిటైమ్‌ ఐపీఓ లిస్ట్‌ కానుంది. వీటిలో మోటిసన్స్‌ జ్యువలర్స్‌ భారీ ప్రీమియంతో లిస్ట్‌ అయ్యే అవకాశముంది. కొత్తగా లిస్ట్‌ అవుతున్న జ్యువలర్స్‌ ఐపీఓలకు విశేష ఆదరణ లభించడమే దీనికి కారణం. జైపూర్‌కు చెందిన మోటిసన్స్‌ ఏకంగా వంద శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయ్యే అవకాశముంది. ఈ కంపెనీ రూ. 55లకు షేర్లను ఆఫర్‌ చేసింది. ఇష్యూ 151 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. అలాగే ముతూట్‌ మైక్రోఫిన్‌, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ కూడా ప్రీమియంతో లిస్ట్‌ అవ్వొచ్చు. ఇక డిసెంబర్‌ 27న హ్యాపీ ఫోర్జింగ్స్‌, ఆర్‌బీజడ్‌ జ్యువెలర్స్‌, క్రెడొ బ్రాండ్‌ మార్కెటింగ్‌ లిస్ట్‌ కానున్నాయి. అదే రోజున ఎస్‌ఎంఈ విభాగంలో శాంతి స్పిన్‌టెక్స్‌, ఎలక్ర్టోఫోర్స్‌ లిస్ట్ కానున్నాయి. వీటిలో కూడా కొన్ని షేర్లు ఆకర్షణీయ ప్రీమియంతో లిస్ట్‌ కానున్నాయి. ఇక డిసెంబర్‌ 28న హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిస్ట్‌ కానుంది. ఈ ఆఫర్‌ 80 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ షేర్‌ కూడా 75 శాతం లిస్టింగ్‌ లాభాలను అందించనుంది.