టెలికాంలోకి ఆటోమేటిక్‌గా 100 శాతం ఎఫ్‌డీఐ..
టెలికాం రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా నేరుగా టెలికాం రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లు తెచ్చేందుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మన సరిహద్దుల ఇన్వెస్టర్లు లేదా కంపెనీల నుంచి మాత్రం ఈ పెట్టుబడులను అనుమతించరు. వీటికి ప్రభుత్వ అనుమతి తప్పనసరి.అలాగే టెలికాం సంస్థల బ్యాంక్ గ్యారెంటీల మొత్తాన్ని కూడా 80 శాతం తగ్గిస్తూ టెలికాం విభాగం (డాట్) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆటోమేటిక్ రూట్లో కేవలం 49 శాతం వరకే ఎఫ్‌డీఐకి అనుమతి ఉండేది. యూనిఫైడ్ యాక్సెస్ సర్వీసెస్ (యూఏఎస్ఎల్) పరిధిలోని టెలికాం లైసెన్సులు, యూనిఫైడ్ లైసెన్సుల విభాగంలోని టెలికాం సంస్థలు సమర్పించే బ్యాంక్గ్యారెంటీలను 80 శాతం తగ్గిస్తూ కూడా డాట్ ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్లకు లబ్ది చేకూరనుంది. వీటితో పాటు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు టాటా కమ్యూనికేషన్స్, అత్రియా కన్వర్జన్స్ టెక్నాలజీస్ వంటి సంస్థలు బ్యాంకుల్లో ఉంచాల్సిన నగదు మొత్తం భారీగా తగ్గనుంది.