For Money

Business News

కొత్త ఇన్వెస్టర్లకు జిమ్‌ రోజర్స్‌ సలహా

బుల్‌ రన్‌ అయిపోవచ్చిందని.. త్వరలోనే బేర్‌ మార్కెట్‌ ప్రారంభమౌతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ జిమ్‌ రోజర్స్‌ అన్నారు. కొత్త ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఎకనామిక్‌ టైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ… మార్కెట్‌లో ఏం జరుగుతోందో పరిశీలిస్తే… ఆందోళన పెరుగుతుందని.. ఫలితంగా తమ పెట్టుబడి రక్షణకు ఇన్వెస్టర్లు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని ఆయన అన్నారు. ఇపుడున్న అనిశ్చితి, గందరగోళం నుంచి తమను తాము రక్షించుకోవడమంటే… తమకు తెలిసిన షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడమే ఏకైక మార్గమని అన్నారు. అంటే కంపెనీ గురించి పూర్తి అవగాహన లేకుండా ఇన్వెస్ట్‌ చేయొద్దని ఆయన కొత్త ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. ఇప్పటికే అనుభవం వచ్చి ఉంటే…మార్కెట్‌ను షార్ట్‌ చేసి భారీ లాభాలు పొందవచ్చిన జిమ్ రోజర్స్‌ అన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితి గురించి ఆయన వివరిస్తూ… రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిన తరవాత మార్కెట్లు పెరుగుతాయని.. తరవాత బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడంతో బ్రేక్‌ పడుతుందని ఆయన చెప్పారు. 2008-09 నాటి పరిస్థితితో పోలిస్తే… ఇపుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రపంచ దేశాలు రుణ ఊబిలో కూరుకుపోయాయని అంటున్నారు. భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కన్పిస్తున్న ర్యాలీ కూడా బుడగేనని అన్నారు. వచ్చే ఏడాది బేర్‌ మార్కెట్‌ వస్తుందని జిమ్‌ రోజర్స్‌ అంచనా వేస్తున్నారు. బేర్‌ మార్కెట్‌ మొదలైతే యాపిల్‌ షేర్‌ కూడా పెరగదని ఆయన హెచ్చరించారు.