For Money

Business News

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 25 శాతం జీఎస్టీ?

ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, రేస్‌లపై 28 శాతం జీఎస్టీ విధించే అవకాశముంది. ఇపుడు కూడా ఆన్‌లైన్‌ గేమ్‌లు, రేసింగ్‌పై జీఎస్టీ ఉంది. అయితే గేమింగ్‌ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు కమిటీని వేశారు. ఈ రంగానికి చెందిన సంస్థలపై జీఎస్టీ ఎంత ఉండాలనే అంశంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన ఈ కమిటీ వీటిపై 28 శాతం పన్ను విధించేందుకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యాపారంపై వేయాలా? లేదా ఒక్కో లావాదేవీపై వేయాలన్న అంశంపై వచ్చే వారం క్లారిటీ రానుంది. వచ్చేవారంలోనే మంత్రుల కమిటీ తన నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీకి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌రాడ్‌ సంగ్మా అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కమిటీ నిన్న సమావేశమై… రేస్‌లు, క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు అందించే సేవల వ్యాల్యూయేషన్‌పై చర్చించింది. వచ్చేవారం ఈ కమిటీ మరోసారి సమావేశమై.. తరవాత నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం బెట్టింగ్‌ లేదా గ్యాంబ్లింగ్‌ ఉన్న ఆన్‌లైన్‌ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీ వేస్తున్నారు. అదే గ్యాంబ్లింగ్‌ లేదా బెట్టింగ్‌ లేకుంటే 18 శాతం జీఎస్టీ వేస్తున్నారు. ప్రతి గేమ్‌కు ఆన్‌లైన్‌ గేమింగ్ సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్‌పై 18 శాతం జీఎస్టీ ఉంది. గుర్రపు పందేలపై .. మొత్తం బెట్‌ వ్యాల్యూపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.