For Money

Business News

మిడ్‌ క్యాప్స్‌ విలవిల

నిఫ్టి పతనం ఒక మోస్తరుగా కన్పిస్తున్నా… చాలా మంది ఇన్వెస్టర్లు భారీ నష్టాలతో ఉన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్ల వద్ద అత్యధికంగా మిడ్‌ క్యాప్‌ షేర్లు ఉంటాయి. నిఫ్టి చిన్న పాటి నష్టంతో ట్రేడవుతున్నా… మిడ్‌ క్యాప్‌ షేర్లు మాత్రం భారీ నష్టాలు పొందాయి. గత నెలలో ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరిన నిఫ్టి మిడ్‌క్యాప్‌ 100 సూచీ… ఆ స్థాయి నుంచి పది శాతంపైగా నష్టపోయింది. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో ఉన్న12 షేర్లు ఏకంగా 20 శాతంపైగా నష్టపోయాయి. సెప్టెంబర్‌ 24న మిడ్‌క్యాప్‌ సూచీ 60,924ని తాకగా.. ఇపుడు 55,945 వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీకి ప్రాతినధ్యం వహించే 100 షేర్లలో సుమారు 46 షేర్లు పది శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మరో 30 షేర్లు ఒక శాతం నుంచి పది శాతం వరకు నష్టపోయాయి. కేవలం 12 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. 20 శాతం దాకా నష్టపోయిన షేర్లలో వొడాఫోన్‌ ఐడియా, ఇంద్రప్రస్త గ్యాస్‌, కొచ్చిన షిప్‌యార్డ్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సుప్రీం ఇండస్ట్రీస్‌, ఆర్‌బీఎన్‌ఎల్‌, సుజ్లాన్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా షేర్లు 20 శాతంపైగా నష్టపోయాయి.